మహాత్ముని మాట... స్ఫూర్తి బావుటా: ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటన

2 Oct, 2022 08:54 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో మహాత్ముని పర్యటన మధుర జ్ఞాపకాలు  

రెండుసార్లు జిల్లాలో పర్యటించిన పూజ్య బాపూజీ  

నేడు గాంధీజీ 153వ జయంతి

సాక్షి, కర్నూలు: మహాత్ముడు కాలంతో ప్రయాణించే మహనీయుడు. తరాలు మారినా ఇప్పటికీ ఆయన నడిచిన మార్గాన్ని ప్రపంచం అనుసరిస్తోంది. ఆయన జీవితం పవిత్రతకు ప్రతి రూపం. ఆయన బాటే అనుసరణీయం. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలను అక్టోబర్‌ 2న దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన 1921, 1929 సంవత్సరాల్లో రెండుసార్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడయాడి స్వాతంత్య్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు పాల్గొనేలా చైతన్య వంతం చేశారు. జాతీయ నిధికి విరాళాలు సేకరించడం కోసం మహాత్మా గాంధీ 1921 సెప్టెంబర్‌ 30న మొట్టమొదటి సారిగా జిల్లాలో అడుగు పెట్టారు.

కర్నూలు పురవీధుల్లో ఓపెన్‌ టాప్‌ జీపులో తిరిగారు. ఆర్‌ఎస్‌ సర్కిల్, ఎస్టీబీసీ కళాశాల, స్టేట్‌ బ్యాంక్‌ సర్కిల్, పాత బస్టాండ్, గడియారం ఆస్పత్రి, పూలబజార్, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ మీదుగా జాతీయ కాంగ్రెస్‌ నాయకులు మేడం వెంకయ్యశెట్టి ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా ఇసుకేస్తే రాలని జనం. మేడలపై, మిద్దెలపై బారులు తీరిన జనం. గాంధీని చూడటానికి రోడ్లపై గుమికూడారు. కర్నూలులో అప్పటి ప్రముఖ స్వాతంత్రయ సమరయోధులు మేడం వెంకయ్య శెట్టి,  లక్ష్మణస్వామి, రంగనాథ మొదలియార్, పొలిమేర శేషయ్యశెట్టి, గొల్లపూడి సీతారామ శాస్త్రి, గాడిచెర్ల, ఆయన వెంట ఉన్నారు.  

తుంగభద్రా తీరంలో బహిరంగ సభ  
తుంగభద్రా నది తీరంలో ఇసుకతిన్నెలో గాంధీజీ బహిరంగ సభ జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఎర్రటి మండుటెండలో జరిగిన ఈ సభకు అప్పట్లోనే దాదాపు 25వేల మంది దాకా జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యారని ఒక అంచనా. సభా ప్రాంగణమంతా వందేమాతరం నినాదం మార్మోగింది.  గాంధీజీ హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని గాడిచెర్ల తెలుగులో అనువదించారు.  

1929లో రెండవ పర్యటన 
మహాత్మా గాంధీ జిల్లాలో రెండవసారి అడుగు పెట్టింది 1929 మే 21న. ఈ సారి ఆయన పర్యటన పత్తికొండ ప్రాంతంలో జరిగింది. ఖద్దరు నిధికి విరాళాలు సేకరిస్తూ ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగిస్తూ గాంధీజీ పర్యటన జరిగింది. జిల్లాలోని చాగల మర్రి, నల్లగట్ల, శిరువెళ్ల, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, నంద్యాల, అయ్యలూరు, పాణ్యం, కర్నూలు, కొనిదేడు, నాగలాపురం, ప్యాలకుర్తి, కోడుమూరు, దేవ నకొండ, జొన్నగిరి, తుగ్గలి పత్తికొండ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో మహాత్మా గాంధీతో పాటు వారి సతీమణి కస్తూరిబా కూడా పాల్గొన్నారు.

మహాత్మా గాంధీతో పాటు దేశభక్త కొండా వెంకటప్పయ్య, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, పత్రికా సంపాదకులు వనం శంకరశర్మ,  పత్తికొండ తాలుకా ప్రెసిడెంట్‌ సంజీవరెడ్డి, ధరణీ రామచంద్రరావు, తొమ్మండ్రు వెంకట నరసయ్య, అగ్రహారం నరసింహారెడ్డి, హెచ్‌. మాణిక్యరావు, పెండేకల్‌ రెడ్డిలక్ష్మమ్మ, సి.బజార్‌రెడ్డి, కాదర్‌బాద్‌ నర్సింగరావు తదితరులు పత్తికొండ పంచాయతీ బోర్డు కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో గొప్ప సభ జరిపారు. ఖద్దరు నిధికి విరాళాలు సేకరించి గాంధీజీకి అందించారు. వనం శంకరశర్మ ప్రజలు అందించిన విరాళం రూ.1116ను వేదిక మీద ఖద్దరు నిధికి అందించడం జరిగింది.   

మరిన్ని వార్తలు