సాధికారతకు చిరునామా.. మహిళా ప్రాంగణం

14 Feb, 2023 08:01 IST|Sakshi
నిమ్మకూరులోని ఎన్టీఆర్‌ మహిళా ప్రాంగణం

రాష్ట్రంలో 13 కేంద్రాలతో 26 జిల్లాల్లో మంచి ఫలితాలు 

విద్యార్థినులకు ఉపాధి, ఉద్యోగినులకు నైపుణ్యాభివృద్ధి 

గత రెండేళ్లలో 86 వేలమందికి ప్రత్యేక శిక్షణ 

ఎన్టీఆర్‌ స్వగ్రామమైన కృష్ణాజిల్లా నిమ్మకూరులోని నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రం (మహిళా ప్రాంగణం) అక్కడికి అడుగుపెట్టే అతివకు ఆత్మవిశ్వాసం అందిస్తోంది. దాదాపు 7.66 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏకకాలంలో 250 మంది శిక్షణ పొందే హాలు, హాస్టల్, డైనింగ్‌ వంటి సౌకర్యాలతో సేవలు అందిస్తోంది. గతంలో నిర్లక్ష్యానికి గురై, ఆపై కరోనా సమయంలోను అంతగా సేవలందించలేకపోయిన ఈ ప్రాంగణంపై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహించడంతో గురుతర పాత్ర పోషిస్తోంది.

ఏడాది కాలంలో మహిళా శిశు సంక్షేమశాఖ అంగన్‌వాడీ కార్యకర్తలకు, వైద్య ఆరోగ్యశాఖ ఆశా వర్కర్లకు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రీపైమరీ, కంప్యూటర్‌ ఆపరేటర్, అసిస్టెంట్‌ ఫ్యాషన్‌ డిజైనరీ, బ్యూటిషియన్‌ కోర్సుల్లో విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం విశేషం. ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రింటింగ్‌ యూనిట్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన రిజిస్టర్లు, రశీదులు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలతోపాటు పోలింగ్‌ కోసం బ్యాలెట్‌ పేపర్లు సైతం ముద్రించడం విశేషం. ఇదే ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలకు స్వధార్‌ గృహాన్ని నిర్వహిస్తున్నాం.  
– వి.శ్రీలక్ష్మి, జిల్లా మేనేజర్‌  

సాక్షి, అమరావతి:  నిమ్మకూరులోని మహిళా ప్రాంగణం గురించి జిల్లా మేనేజర్‌ వి.శ్రీలక్ష్మి సాక్షి ప్రతినిధికి తెలిపినట్లు.. రాష్ట్రంలో 13 నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రాలు 26 జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థి­నులు, ఉద్యోగినులకు విశేషసేవలు అందిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపి సాధి­కారత సాధించేలా అవసరమైన ఉపాధి, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాయి. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా శిక్షణ కార్యాక్రమాల ద్వారా అవగాహన పెంచుతున్నాయి. నైపుణ్యా­భివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో భారీస్థాయిలో ఉపాధి ఆధారిత కార్యకలాపాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభ్యు­న్న­తి కోసం కృషిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.   

ప్రతి ప్రాంగణంలో సదుపాయాలు  
రాష్ట్రంలోని ప్రతి మహిళా ప్రాంగణం (శిక్షణా కేంద్రం) ఒక జిల్లా మేనేజర్‌ పర్యవేక్షణలో సమర్థంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో ప్రాంగణం సుమారు 8 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రతి ప్రాంగణంలో 200 నుంచి 250 మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేలా వసతి సౌకర్యాలు కల్పించారు. కార్యాలయ భవనం, థియరీ, ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చేందుకు అనుకూలమైన గదులు, నైపుణ్య శిక్షణతోపాటు ఆయా వస్తువుల తయారీ సెంటర్లు, వర్కుషెడ్లు, డార్మిటరీలతో హాస్టలు సదుపాయం, డైనింగ్‌ హాలుతో విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేశారు.   

ఉపాధి శిక్షణ 
స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణలో మహిళా ప్రాంగణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టమాటా ప్రాసెసింగ్, ఫ్యాషన్‌ డిజైనింగ్, టైలరింగ్, అలంకరణలు, బ్యూటీషియన్‌ కోర్సులు, కంప్యూటర్‌ ఆపరేటర్, ప్రీప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్, నర్సింగ్, షీ ఆటో కార్‌ డ్రైవింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు స్థానికంగా డిమాండ్‌ ఉండే అనేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 

ఉద్యోగినులకు వృత్తి సామర్థ్యం పెంపు 
ప్రభుత్వ ఉద్యోగినులు వృత్తి సామర్థ్యం పెంచుకునేలా ఈ కేంద్రాల్లో వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, మెప్మా సిబ్బంది వంటి అనేక విభాగాల్లో ఉద్యోగినులు ఇక్కడ శిక్షణ పొంది వృత్తి సామర్థ్యం పెంచుకున్నారు. గత రెండేళ్లలో రూ.6.30 కోట్ల ఖర్చుతో 13 కేంద్రాల్లో 26 జిల్లాలకు చెందిన 86 వేలమందికి శిక్షణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు