పేర్లు, జిల్లా కేంద్రాలపైనే ప్రధానంగా సూచనలు 

3 Mar, 2022 04:11 IST|Sakshi

ఇప్పటి వరకు వచ్చినవి 7,500  

విజయనగరం నుంచి అత్యధికంగా 4,500 సూచనలు

5 కేటగిరీలుగా క్రోడీకరించిన రాష్ట్ర స్థాయి కమిటీ 

ప్రకాశం, గుంటూరు, చిత్తూరులో నేడు తుది గడువు 

60 అంశాలపైనే అభ్యంతరాలు

ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌    

సాక్షి, అమరావతి: నూతన జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 7,500 ప్రజాభిప్రాయాలు అందగా జిల్లా కేంద్రాలు, జిల్లాల పేర్లపైనే ఎక్కువ సూచనలు వచ్చాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా నుంచి 4,500కిపైగా అభిప్రాయాలు వచ్చాయి. అందులో ఒక అంశంపైనే 4 వేలకుపైగా ఉండడం గమనార్హం. సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలం ప్రస్తుతం విజయనగరంలో ఉండగా పునర్వ్యవస్థీకరణలో దాన్ని పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో ప్రతిపాదించారు. పార్వతీపురం తమకు బాగా దూరమవుతుంది కాబట్టి విజయనగరంలోనే ఉంచాలనే అభిప్రాయాలు పెద్దఎత్తున వచ్చాయి. ఎస్‌ కోట నియోజకవర్గం కొత్తవలస మండలాన్ని విజయనగరంలో కాకుండా విశాఖలో కలపాలని కొన్ని సూచనలు వచ్చాయి. పార్వతీపురం జిల్లాకు మన్యం జిల్లాగా పేరు పెట్టడంపైనా ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయి. మన్యం అంటే ఏజెన్సీ ప్రాంతంగా మారుతుందని, దానివల్ల 1/77 చట్టం పరిధిలోకి వెళ్లిపోయి భూముల క్రయ విక్రయాలకు ఇబ్బందికరంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మన్యం అని కాకుండా పార్వతీపురం పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. 

కృష్ణా జిల్లాలో పేర్లు అటు ఇటు మార్చాలని..  
కృష్ణా జిల్లాలో 2,900 అభ్యంతరాలు రాగా జిల్లా కేంద్రాల పేర్లు మార్చాలనే సూచనలు వచ్చాయి. ఎన్టీఆర్‌ జిల్లాను వంగవీటి జిల్లా, కృష్ణా జిల్లాను ఎన్టీఆర్‌ జిల్లాగా చేయాలని సూచనలు అందాయి. మైలవరం డివిజన్‌ ఏర్పాటు చేయాలని 2 వేల వరకు సూచనలు వచ్చాయి. టీడీపీ నేత దేవినేని ఉమా నేతృత్వంలో రాజకీయ కోణంలో వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను కోనసీమ జిల్లాలో కలపవద్దని, రాజమండ్రి లేదా కాకినాడలో కలపాలనే సూచనలు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం, ఎటపాకలను పాడేరులో కాకుండా రాజమండ్రిలోనే ఉంచాలని, లేదంటే ప్రత్యేక జిల్లాగా చేయాలని పలు అభిప్రాయాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కాకుండా విశాఖలోనే ఉంచాలనే సూచనలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. విజయనగరంలో జామి, శ్రీకాకుళంలో పాతపట్నం మండలాలను ఇప్పుడున్న డివిజన్‌లో కాకుండా వేరే డివిజన్‌లోకి మార్చాలనే సూచనలు వచ్చాయి.  

జిల్లా కేంద్రాలపై మూడు చోట్ల అభ్యంతరాలు..  
జిల్లా కేంద్రాలుగా అనంతపురం జిల్లాలో హిందూపురం, వైఎస్సార్‌ కడపలో రాజంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణాలను చేయాలని సూచనలు వచ్చాయి. భీమవరం, రాయచోటి, పుట్టపర్తిని వ్యతిరేకిస్తూ అభ్యంతరాలు అందాయి. ద్వారకా తిరుమల మండలాన్ని రాజమండ్రిలో కాకుండా ఏలూరు జిల్లాలో కలపాలని భారీగా సూచనలు వచ్చాయి. కోనసీమకు అంబేడ్కర్, కర్నూలుకు దామోదరం సంజీవయ్య, కృష్ణాకు పింగళి వెంకయ్య, ఏలూరుకు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్లు పెట్టాలనే సూచనలూ అందాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చిరంజీవి జిల్లాగా పేరు పెట్టాలని కొన్ని సూచనలు అందడం విశేషం.  

ఐదు కేటగిరీలుగా.. 
సూచనలు, అభ్యంతరాలను ఐదు కేటగిరీలుగా విభజించి పరిశీలిస్తున్నారు. డివిజన్‌ కేంద్రం మార్పు, జిల్లా కేంద్రం మార్పు, కొత్త డివిజన్‌ ఏర్పాటు, ఆ డివిజన్‌లో కాకుండా మరో డివిజన్‌లోకి మార్చడం, నియోజకవర్గాల్లోని మండలాలను విభజించడం... ఇలా 5 విభాగాలుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను విభజించారు.  

9 జిల్లాల్లో ముగిసిన గడువు.. 
సూచనలు, అభ్యంతరాల స్వీకరణ గడువు దాదాపు ముగింపు దశకు వచ్చింది. నోటిఫికేషన్‌ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అభ్యంతరాలకు గడువు ఇవ్వగా ఫిబ్రవరి 24వ తేదీకే 9 జిల్లాల్లో గడువు ముగిసింది. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ నెల 3వ తేదీ వరకు, అనంతపురం జిల్లాలో 5వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికే సూచనలు, అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ల కమిటీ ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి అధ్యయనం జరిపి ఒక అభిప్రాయానికి వచ్చింది. వచ్చిన వినతులన్నింటినీ క్రోడీకరించి తమ సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీకి గడువు ముగిసిన వారం రోజుల్లో సమర్పించనుంది. అనంతరం ప్రభుత్వ స్థాయిలో వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

కొత్త జిల్లాలకు ప్రజామోదం
ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌
కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రజలు ఆమోదించినట్లు తమ అధ్యయనంలో కనిపించిందని ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ చెప్పారు. విజయవాడలోని ప్రణాళికా శాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై అధ్యయనం జరిపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించామని తెలిపారు. అభ్యంతరాలు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నా కేవలం 60 అంశాలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు అందినట్లు గుర్తించామన్నారు.

జనాభా, ఏరియా సైజును బట్టి కొన్ని కలపడం, మార్చడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ముందే తాము ఆలోచించామని, అలాంటి చోట్లే అభ్యంతరాలు, సూచనలు వచ్చాయన్నారు. పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకోగా దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలను రెండో లెవల్‌గా, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా అలాగే ఉంచాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలనే నియమాల ఆధారంగా చేసిన పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. సూచనలపై కలెక్టర్ల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మార్చి ఆఖరి వారంలో తుది నోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి ఆర్డర్‌ టు సర్వ్‌ ఇస్తారని చెప్పారు. కొత్తగా నియమించే కలెక్టర్లను ముందుగా ఓఎస్‌డీలుగా నియమించి ఆ తర్వాత నోటిఫైడ్‌ తేదీ నాటికి కలెక్టర్లుగా మారేలా ఆదేశాలు ఇస్తారని తెలిపారు.   

మరిన్ని వార్తలు