రూ.110 కోట్ల ‘మైత్రీ ప్లాంటేషన్స్‌’ ఆస్తుల జప్తు

8 Jun, 2022 05:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

210 స్థిరాస్తులను జప్తు చేసిన ఈడీ

సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి మదుపరులను మోసగించిన కేసులో మైత్రీ ప్లాంటేషన్స్‌–హార్టీకల్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన రూ.110 కోట్ల విలువైన  210 స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఆ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీలైన శ్రీనక్షత్ర బిల్డర్స్‌–డెవలపర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, మైత్రీ రియల్టర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఆ సంస్థల డైరెక్టర్లు లక్కు కొండారెడ్డి, లక్కు మాల్యాద్రిరెడ్డి, లక్కు మాధవరెడ్డి, కొలికపూడి బ్రహ్మారెడ్డి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఆ సంస్థలపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద 2013లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన 210 స్థిరాస్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 196, తెలంగాణలో 13, కర్ణాటకలో ఒకటి ఉన్నాయి. మైత్రీ ప్లాంటేషన్స్‌–హార్టీకల్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట లక్కు కొండారెడ్డి, ఇతరులు నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి డిపాజిట్లు సేకరించారని ఏపీ పోలీసులు 2013లో 12 ఎఫ్‌ఐఆర్‌ల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం ఈ కేసు దర్యాప్తును ఈడీ చేపట్టడంతో కుంభకోణం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. లక్కు కొండారెడ్డి, తదితరులు అధిక కమీషన్లు ఎరజూపి ఏజెంట్లను నియమించుకుని మరీ డిపాజిట్ల సేకరణ చేపట్టారు. మదుపరులకు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపించి ఏకంగా రూ.288.42 కోట్లను డిపాజిట్లుగా సేకరించారు. అనంతరం ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా తమ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లోకి మళ్లించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఈ కేసులో ఆస్తులను జప్తు చేసిన ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.  

మరిన్ని వార్తలు