అత్యధికులు విద్యాధికులే 

12 Apr, 2022 03:42 IST|Sakshi
వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్‌ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రుల గ్రూప్‌ ఫొటో

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్‌) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్‌ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్‌ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు.  
► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్‌ మెడిసిన్‌) చదివారు.  
► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ అందుకున్నారు.  
► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సాధించారు.  
► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్‌ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌ అండ్‌ గ్లోబల్‌ వార్మింగ్‌పై పీహెచ్‌డీ చేస్తున్నారు. 
► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు.  
► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు బీటెక్‌ చదివారు.  
► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు.   

హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్‌లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం.    

మరిన్ని వార్తలు