Tandoori Chai: తందూరీ టీ.. దీని కథేంటీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?

2 Jan, 2022 11:17 IST|Sakshi

రావులపాలెంలో వినూత్న టీ తయారీ 

 కాలిన మట్టి పాత్రలో మరగడంతో ప్రత్యేక రుచి, వాసన

అదుర్స్‌ అంటున్న చాయ్‌ ప్రియులు

కొత్తపేట/రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా): బెల్లం టీ, అల్లం టీ, గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, మిరియాల టీ వంటి వివిధ రకాల టీల గురించి విన్నాం.. తాగుతున్నాం.. భిన్న రుచులను ఆస్వాదిస్తున్నాం. కానీ ఈ తందూరీ చాయ్‌ (టీ) ఏమిటనుకుంటున్నారా! ఇదో కొత్త రకం చాయ్‌.. సహజంగా అందరికీ తందూరీ అనే పదం చికెన్‌ వంటకాల్లో వింటాం. కోడి మాంస ప్రియులకు ఈ పదం గురించి బాగా తెలుస్తుంది. రెస్టారెంట్లలో కోడిని శుభ్రం చేసి, నిప్పులపై కాల్చి వండి తందూరీగా అందిస్తారు. మరి ఇక్కడ చాయ్‌లో తందూరీ ఏమిటనే సందేహం కలుగుతుంది కదా... చాయ్‌ను కూడా నిప్పుల పైనే తయారు చేస్తారు. దీని కథా కమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే రావులపాలెం అక్షర సినిమా థియేటర్స్‌ సమీపాన తందూరి చాయ్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందే.

చదవండి: ఆరేసుకోబోయి పారేసుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్‌

ఇలా చేస్తున్నారు..
మట్టితో తయారు చేసిన గ్లాసులను ఎర్రగా కాల్చేందుకు ఇనుప పీపాలో కొలిమి మాదిరిగా ఏర్పాటు చేశారు. దీనిలో బొగ్గులు వేసి రోజంతా మండేలా తయారు చేశారు. ఎర్రగా బట్టీల్లో ఇటుకలా కాలుస్తుంటారు. సాధారణ టీ మాదిరిగానే పాలు, పంచదార, టీ పొడి, నీళ్లతో కలిపి తయారు చేసి దానిని జార్‌లోకి తీసుకుని కొలిమి వద్దకు తీసుకువస్తారు. కొలిమిలో ఎర్రగా కాలుతున్న మట్టి గ్లాసును బయటకు తీసి ఒక ఇత్తడిపాత్రలో ఉంచుతారు. ఎర్రటి మట్టి గ్లాసులోకి ఆ చాయ్‌ పోస్తారు. వెంటనే  అది మట్టిపాత్ర వేడికి పొగలు చిమ్ముతూ, నురగలుగా పొంగుతుంది. అలా పొంగిన చాయ్‌ ఇత్తడి పాత్రలో చేరుతుంది. స్వచ్ఛమైన మట్టిలో మరిగిన చాయ్‌కు తందూరి రుచి.. వాసన వస్తుంది. ఆ పాత్ర నుంచి మళ్లీ మట్టి గ్లాసులో పోసి విక్రయిస్తున్నారు. దీనిని తాగేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

మంచి టేస్ట్‌ రిలాక్స్‌గా..  
యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్‌ కోసం చాలా మంది చాయ్‌ తాగుతుంటారు. ఏదైనా పనిలో ఉన్నప్పుడు చురుకుదనం, ఉత్సాహాన్ని పొందేందుకు చాలా మందికి చాయ్‌ని ఆస్వాదించడం అలవాటు. ఇప్పుడు మార్కెట్‌లో అనేక రకాల చాయ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఆరోగ్యపరంగా తయారు చేస్తుంటే, కొన్ని రుచి కోసమే తయారు చేస్తున్నారు. ఫిల్టర్‌ టీ, కాంటినెంటల్‌ టీ, స్ట్రాంట్‌ టీ, ధమ్‌ టీ పేర్లతో రకరకాలుగా అందిస్తున్నారు.  రావులపాలెంలో యువకులు కొత్తగా ఆలోచించి ఉత్తరాది తందూరి చాయ్‌ను ఇక్కడ తయారుచేస్తూ స్థానికులను, టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొందరు తందూరీ చాయ్‌ తయారు చేస్తూ టీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు