మలేరియా కట్టడి చర్యలు భేష్‌

25 Apr, 2022 09:41 IST|Sakshi

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): మలేరియా పేరు చెబితేనే విశాఖ మన్యం గడగడలాడేది. వ్యాధులు సీజన్‌ ప్రారంభమైతే ఏజెన్సీలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగంలో అలజడి రేపేది. అలాంటి మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫాలివ్వడంతో వ్యాధి తీవ్రతతోపాటు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది.  ఉమ్మడి విశాఖ జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య 56 శాతం తగ్గాయి. ఏటా ఏప్రిల్‌ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మలేరియాను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిసారిగా 2008లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారని జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. దీనికి సంబంధించి  ఆమె అందించిన వివరాలు.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి మలేరియా కేసులు నమోదు పూర్తిగా తగ్గి పోవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా 2020 నుంచి 2024 వరకూ ఏడాదికి ఒక థీమ్‌తో చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది మలేరియా భారాన్ని తగ్గించడం, జీవితాలను రక్షించడం అనే థీమ్‌తో చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా  2030 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం. 

గణనీయంగా తగ్గిన కేసులు 
ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండేళ్లుగా మలేరియా కేసులతోపాటు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసులు నమోదు 56 శాతానికి తగ్గింది. 2021 లో 239 కేసులు నమోదుకాగా, 2022 లో ఇప్పటి వరకూ 105 కేసులు నమోదయ్యాయి.

(చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి)

మరిన్ని వార్తలు