Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా? 

5 Nov, 2022 09:01 IST|Sakshi

నోటీసులిచ్చి ఆక్రమణలు తొలగిస్తున్నా... జనసేన రాజకీయాలు

రెండేళ్ల కిందటే మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్‌లో విస్తరణ పనులు ప్రారంభం

గత జనవరి– ఫిబ్రవరిలో ‘ఇప్పటం’లో ఆక్రమణల్ని మార్కింగ్‌ చేసిన అధికారులు

ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు గ్రామంలో 54 మందికి నోటీసులు

ఇప్పుడు తొలగిస్తున్నది వారి ప్రహరీలనే.. సహకరిస్తున్న యజమానులు

దీన్లో భాగంగా వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు, కార్యకర్తల ప్రహరీలూ తొలగింపు

చివరి నాలుగిళ్ల వద్ద జనసేన యాగి...

మార్చిలో వపన్‌ ప్రకటించిన రూ.50 లక్షలు అడిగినందుకే వంకర  రాజకీయం

సాక్షి, అమరావతి: ఆక్రమణలు పెరిగి రోడ్లు ఇరుకైపోవటంతో మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్‌ పరిధిలోని రోడ్ల వెంట ఉన్న ఆక్రమణలను తొలగించే పని రెండేళ్ల కిందటే మొదలుపెట్టారు. గత జనవరికల్లా పూర్తి చేశారు. తరువాత రూరల్‌ ప్రాంతంలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్ల ఆక్రమణలపై చర్యలకు దిగారు. దాన్లో భాగంగానే ఇప్పటం గ్రామ పరిధిలో 75– 80 అడుగుల మేర ఉండాల్సిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డును ఇరువైపులా 10 అడుగుల మేర ఆక్రమించి ప్రహరీలను నిర్మించుకున్నట్లు గుర్తించారు.

ఇలా 54 మంది రోడ్డు ఆక్రమించినట్టు గుర్తించి జనవరిలో మార్కింగ్‌ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో రెండుసార్లు నోటీసులిచ్చారు. అనంతరం ఆక్రమణల తొలగింపును ఆరంభించారు. ఆత్మకూరు– పెద వడ్లపూడిలో తొలగింపు పూర్తయ్యింది కూడా. ఇదీ.. వాస్తవం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.3 కోట్లతో ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయటంతో పాటు గత నెలలో మరో రూ.6 కోట్లను ఈ గ్రామానికి కేటాయించిందనేది కూడా కాదనలేని నిజం.

తొలగింపులో భాగంగా రెండు రోజుల కిందట దాదాపు 25 మంది ఇళ్ల ప్రహరీలను తొలగించగా సంబంధింత యజమానులు సైతం సహకరించారు. ఇందులో వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్‌తో పాటు పార్టీ కార్యకర్తల ఇళ్ల ప్రహరీలూ ఉన్నాయి. కానీ, శుక్రవారం చివరి నాలుగు ఇళ్ల ప్రహరీలను తొలగిస్తుండగా జనసేన నాయకులు గొడవకు దిగారు. తాము జనసేనకు సహకరిస్తున్నందుకే ఇళ్లు కూలుస్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వారి ఇళ్లను టార్గెట్‌ చేసి కూల్చివేస్తున్నారని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే...

ఇప్పటం గ్రామంలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణలను జనవరిలో మార్కింగ్‌ చేశారు. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో నోటీసులిచ్చారు. 
తొలగిస్తున్నవి కేవలం రోడ్డును ఆక్రమించుకుని ఉన్న ప్రహరీలే. కానీ జనసేన ప్రచారం చేస్తున్నట్లుగా ఎవ్వరి ఇళ్లనూ కూల్చేయలేదు. 
ప్రహరీలు తొలగింపునకు గురైన వారిలో వైఎస్సార్‌ సీపీ గ్రామ అధ్యక్షుడు లచ్చి వెంకటేశ్వరరావు గౌడ్, పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. 
జనసేన ప్లీనరీ మార్చి నెలలో ఇప్పటం గ్రామంలో జరిగింది. ఆనాడు పవన్‌ కళ్యాణ్‌ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలిస్తానని ప్రకటించారు కానీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలేదు. 

ప్రకటించిన డబ్బులివ్వాలని స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అడగటంతో జనసేన నేతలు సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకు పథకం పన్నారు. 
ఇప్పుడు ప్రహరీలు తొలగిస్తుంటే రాజకీయం మొదలుపెట్టిన పవన్‌ కళ్యాణ్‌... 2016లో కృష్ణా పుష్కరాల కోసమని తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం, బోట్‌ యార్డు, ఎన్టీఆర్‌ కరకట్ట, క్రిస్టియన్‌పేట తదితర ప్రాంతాల్లో 325 ఇళ్లను నాటి టీడీపీ ప్రభుత్వం తొలగించినపుడు నోరు మెదిపితే ఒట్టు. 

మరిన్ని వార్తలు