అధికారం లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తొస్తారా?

7 Sep, 2022 06:04 IST|Sakshi

ఎల్లో మీడియాపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం 

మూడేళ్లలోనే బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.398.88 కోట్లు 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఎల్లో మీడియాకు చంద్రబాబు అధికారంలో లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తుకొస్తారా? అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. బ్రాహ్మణ సంక్షేమంపై కొన్ని పత్రికల్లో వెలువడ్డ అసత్య కథనాలను ఆయన మంగళవారం ఓ ప్రకటనలో  ఖండించారు. టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విష ప్రచారం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రాహ్మణుల సాంఘిక, ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి సీఎం జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పచ్చ మీడియా  నిస్సిగ్గుగా అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు. 

బాబు పాలన బ్రాహ్మణులకు చీకటి యుగం 
బాబు పాలన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చీకటి యుగమన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా వచ్చాకే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను పటిష్టం చేసి కొత్త వెలుగులు నింపారని గుర్తు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చంద్రబాబు హయాంలో కేటాయించిన మొత్తం రూ.285 కోట్లు కాగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిక మూడేళ్లలోనే రూ.398.88 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు.  

నవరత్నాల ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి రెట్టింపు సంక్షేమాన్ని అందించారని పేర్కొన్నారు.  అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తే గొంతెమ్మ కోర్కెలంటూ అవమానించిన వ్యక్తి చంద్రబాబుని గుర్తుచేశారు. ఆలయాలపై చంద్రబాబు హయాంలో నియమించిన పాలక మండళ్ల వేధింపులు తట్టుకోలేక పలువురు అర్చకులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.  

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్‌ అధికారి ఐవైఆర్‌ కృష్ణారావును ఏ విధంగా అవమానించారో ఎల్లో మీడియాకు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. సదావర్తి భూములు సహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల భూములను టీడీపీ హయాంలో మింగేశారని మండిపడ్డారు. బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.   

మరిన్ని వార్తలు