పేదల విద్యార్థులను ఆదుకునేలా ‘విద్యా కానుక’

8 Oct, 2020 11:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున విద్య మీద దృష్టి సారించారని విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌నగర్‌, ఎంకేబేగ్నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని వ్యవస్థలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రక్షాళన చేశారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పాఠ్య పుస్తకాలు సకాలంలో అందేవికావని, మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉండేదని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనంలో ఏ రోజుకు ఎటువంటి మెనూ ఉండాలో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ స్వయంగా ఆలోచించారని గుర్తుచేశారు. ఫీజ్ రీయింబర్స్మెంట్, అమ్మఒడి రూపంలోవేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

కార్పొరేట్ శక్తులకు దీటుగా రూ.700కోట్లతో 40లక్షల మంది పిల్లలకు కిట్లను తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ స్థాయిలో 15వేల మందికి రూ.3కోట్లతో జగన్న విద్యా కానుక అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంలో రూ.10కోట్లతో విద్యార్థులకు కిట్లు అందిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్‌ విద్య మీద తీసుకున్న శ్రద్ధ ఏ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. విద్య ద్వారానే సమాజంలో దారిద్ర్యాన్ని నిర్ములించవచ్చని, పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని పేర్కొన్నారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని సీఎం వైఎస్‌ జగన్‌ నిరవేర్చుతున్నారని చెప్పారు. విద్యకు కేంద్రంగా ఉన్నకృష్ణా జిల్లాలో పేదల విద్యార్థులను ఆదుకునేలా విద్యా కానుకను ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ విద్యలో అగ్రభాగాన ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి విద్యతో ఉన్నత శిఖరాలకు అధిరోహించదానికి ఈ పధకం దోహదపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు