మీ గ్యాగ్‌ ఆర్డర్‌ను సవరించండి

21 Sep, 2020 03:35 IST|Sakshi

మీ ఉత్తర్వులవల్ల నా హక్కులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్ర హక్కని రాజ్యాంగం చెబుతోంది

ఈ హక్కులో మీడియా హక్కులు కూడా మిళితమై ఉన్నాయి 

హైకోర్టు ఉత్తర్వులు ఆ పవిత్ర హక్కును కాలరాసేలా ఉన్నాయి 

హైకోర్టులో న్యాయవాది మమత రాణి ఇంప్లీడ్‌ పిటిషన్‌

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు.
 
ఆంక్షలతో పౌరుల హక్కులకు భంగం 
అధికరణ–19 ప్రకారం.. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని.. అధికరణ–19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీచేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని.. న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు.

ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులవల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలను వినాలని ఆమె కోర్టును కోరారు. అలాగే, ఈ ఏడాది జనవరి 10న ‘అనురాధా భాసిని వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమత రాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. 

పత్రికా స్వేచ్ఛపై జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. 
ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛాయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కులను ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంటర్నెట్‌ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ–19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడంలేదు. వివిధ సాకులు, కారణాలు చూపి, ఆ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించుకునేందుకు అవకాశం ఇవ్వాలి.  

మరిన్ని వార్తలు