Proddatur Crime: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్‌.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా'

16 Jun, 2022 11:31 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నా పిల్లలకు తల్లి లేకుండా చేశాడనే చంపానన్న నిందితుడు

ప్రొద్దుటూరు క్రైం : ‘జరిగిందేదో జరిగిపోయింది.. మన ఇంటికి పోదాం రా’అని భార్య అనురాధను పిలిచాడు. పలుమార్లు పిలిచినా ఇమ్మానియేల్‌ను వదిలి పెట్టి రానని భర్తతో తెగేసి చెప్పింది. తన పిల్లలకు తల్లిని లేకుండా చేసిన ఇమ్మానియేల్‌పై అతను(రవి) పగ పెంచుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సహజీవనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.  అతన్ని ఎలాగైనా హతమార్చాలని వ్యూహం పన్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు.

రెండు రోజుల క్రితం ఇమ్మానియేల్‌ నిద్రపోతుండగా పిడిబాకుతో పొడిచి హత్య చేశాడు. ఈ హత్య చేసిన కేసులో నిందితుడు రవిని టూ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ ప్రసాదరావు బుధవారం సాయంత్రం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌లోని ఇటుకల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న ఇమ్మానియేల్‌ను హత్య చేసి రవి పారిపోయాడు. ఈ సంఘటనపై టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అరెస్ట్‌ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు 

సుమారు ఐదేళ్ల కిందట రవి భార్య అనురాధ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఇమ్మానియేల్‌తో ప్రొద్దుటూరుకు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవి తన భార్య అనురాధ వద్దకు వెళ్లి సంసారానికి రమ్మని ప్రాధేయపడ్డాడు. పిల్లలు అమ్మా అని తపిస్తున్నారు.. పోదాం రా అని ఎంతగా బతిమాలినా ఆమె కనికరించలేదు. ఇమ్మానియేల్‌ను వదిలేసి రానని భర్తతో తెగేసి చెప్పింది. ఇలా పలుమార్లు వచ్చి పిలిచినా ఆమె మనసు కరగలేదు. 

నిన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్తా : రవి
దీనంతటికీ కారకుడైన ఇమ్మానియేల్‌పై రవి పగ పెంచుకున్నాడు. ‘నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్‌. ఎప్పటికైనా నిన్ను చంపేసి నా భార్యను తీసుకుపోతా ’అని అతన్ని రవి హెచ్చరించాడు. అయినా ఇమ్మానియేల్‌ లైట్‌గా తీసుకున్నాడు. ఆ రోజు నుంచి ఇమ్మానియేల్‌ను హతమార్చేందుకు అవకాశం కోసం రవి ఎదురుచూస్తూ వచ్చాడు. అతను ఇటుకల బట్టి వద్ద బయట పడుకుంటున్నాడని పసిగట్టిన రవి ఇదే మంచి తరుణమని భావించాడు.

సోమవారం అర్ధరాత్రి ఇమ్మానియేల్‌ నిద్రపోతున్న సమయంలో పిడిబాకుతో కసితీరా పొడిచి చంపాడు. అనంతరం రవి బైక్‌పై వెళ్తుండగా మోడంపల్లె బైపాస్‌ రోడ్డులో సీఐ ఇబ్రహీం సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి బైక్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రవిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే హంతకుడ్ని అరెస్ట్‌ చేసిన సీఐ ఇబ్రహీం, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డును అందజేశారు.

మరిన్ని వార్తలు