నల్లకోళ్ల పేరుతో రూ.50 లక్షల కుచ్చుటోపీ 

28 Oct, 2020 07:11 IST|Sakshi
హరిప్రసాద్‌ (ఫైల్‌) 

కడక్‌నాథ్‌ కోళ్లపేరిట కుచ్చుటోపీ 

మూడు జిల్లాల రైతుల నుంచి రూ.50లక్షలు వసూలు 

లబోదిబోమంటున్న బాధితులు 

సాక్షి, పీలేరు: నల్లకోళ్లు..అస్సలు ఖర్చులేదు..ఈ కోళ్ల వ్యాపారం చేస్తే డబ్బే..డబ్బు..మార్కెట్లో డిమాండ్‌ మస్తు..మస్తు..అంటూ ఊరించిన ఓ ప్రబుద్ధుడు కుచ్చుటోపీ పెట్టాడు. పెంచితే 4 నెలల తర్వాత తానే కొంటానంటూ నమ్మించి, కోడిపిల్లల పేరిట మూడు జిల్లాల్లో రైతుల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసి ఎగనామం పెట్టాడని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.  మంగళవారం పీలేరు ప్రెస్‌క్లబ్‌లో వారు తెలిపిన వివరాలు..కలికిరి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా 5 నెలల నుంచి నివాసం ఉంటున్నానని, తాను ఎంహెచ్‌బీ కడక్‌నాథ్‌ కోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నానని, తనపేరు హరిప్రసాద్‌ అని పీలేరు, కలికిరి పరిసర ప్రాంతాల్లో కొందరు రైతుల్ని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.

ఒక్కో కోడిపిల్లకు రూ.120 చెల్లిస్తే తమ సంస్థ నుంచి కోడిపిల్లలను తెప్పించి ఇస్తామని, ఆ కోడిపిల్లలను నాలుగు నెలల పాటు పెంచితే కిలో రూ.670 చొప్పున తిరిగి సంస్థ కొనుగోలు చేస్తుందని నమ్మించాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.ల„క్ష నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసి, ఖాళీ చెక్కులు ఇచ్చాడు. అయితే వారాలు గడచినా కోడి పిల్లలు ఇవ్వలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఫోన్‌లో కోరితే దురుసుగా మాట్లాడుతుండడంతో విసిగి వేసారిన రైతులు ఈనెల 17న కలికిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.  (జన్మదినం రోజే బలవన్మరణం)

పీలేరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతున్న బాధితులు  
చిత్తూరు జిల్లాతోపాటు వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల వారినీ ఇలాగే అతడు మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని, పోలీసు ఉన్నతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బాధితులు రవీంద్ర, మనోహర్‌రెడ్డి, సలీమ్, రాకేష్‌కుమార్, శివజ్యోతి, మనోజ్‌కుమార్, రామస్వామి, మల్లేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు