చేతిని అతికించి.. ఓ కుటుంబాన్ని బతికించారు

7 Feb, 2021 08:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాకినాడ జీజీహెచ్‌లో ఆరు గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స

కాకినాడ క్రైం: ‘అబ్బే.. లాభం లేదు. చెయ్యి తీసేయాల్సిందే.. ఆ పని చేయాలన్నా కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతుంది.. ఇతనిదేమో పొరుగు రాష్ట్రం.. ప్రభుత్వ పథకాలేవీ వర్తించవు మరి’ అన్నారు రాజమహేంద్రవరానికి చెందిన ఓ ప్రైవేట్‌ వైద్యుడు. ఆ మాట విన్న తోటి కార్మికులు, ఫ్యాక్టరీ నిర్వాహకులు కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్‌)లో నిష్ణాతులైన వైద్య బృందం ఉందనే ధైర్యంతో బాధితుడిని అక్కడికి తీసుకెళ్లారు. శరీరం నుంచి వేరు పడిన కుడి చేతిని ప్రభుత్వ వైద్యులు అతికించారు. వివరాల్లోకి వెళి తే.. ఛత్తీస్‌గఢ్‌లోని కిర్లాపాల్‌కు చెందిన సోనా కురానీ రాజా నగరం మండలం నందరాడ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో ఉండగా అతడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. (చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు)

శరీరం నుంచి వేరుపడిన అతడి చేతిని అతికించడం కష్టమని ప్రైవేటు వైద్యుడు చేతులెత్తేయడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీఎస్‌ఎస్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం ఆరు గంటల పాటు శస్త్రచికిత్సలు చేసి శనివారం ఉదయానికి అతడి చేతిని తిరిగి అతికించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కుడి మోచేతి ఎముక పూర్తిగా బయటికి వచ్చి, చర్మం వేలాడుతున్న క్లిష్టమైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆరంభించామన్నారు.(చదవండి: కిడ్నాప్‌ డ్రామా: నివ్వెరపోయే విషయాలు)

చేతి లోపలి నరాలు పూర్తిగా దెబ్బతినడంతో చిన్నపాటి వైర్ల వంటివి అంతర్గతంగా ఏర్పాటు చేసి రాడ్లు వేశామన్నారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ బృందం చర్మాన్ని తిరిగి అతికించే ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతమైందని వెల్లడించారు. శస్త్రచికిత్సలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివకుమార్, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు డాక్టర్‌ దీపక్, డాక్టర్‌ గంగాధర్, జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు డాక్టర్‌ గిజూలాల్, డాక్టర్‌ నవీన్‌ కీలకంగా వ్యవహరించారని వివరించారు. జీజీహెచ్‌లో అందిన వైద్య సేవలకు కురానీ కుటుంబ సభ్యులు తాము ఊహించని అద్భుతం జరిగిందని భావోద్వేగంతో చెప్పారు.  

మరిన్ని వార్తలు