హైబ్రీడ్‌ సైకిల్‌.. కేవలం ఆరు రూపాయలతో!

11 Jan, 2022 09:22 IST|Sakshi
ఎలక్ట్రిక్‌ సైకిల్‌తో బాబా ఫకృద్దీన్‌

‘అనంత’ యువకుడి నూతన ఆవిష్కరణ 

చదివింది 9వ తరగతే 

అనంతపురం: మేథో శక్తి ఒకరి సొత్తు కాదని నిరూపించాడు అనంతపురానికి చెందిన యువకుడు. సాధించాలనే తపన.. నూతన ఆవిష్కరణల పట్ల ఉన్న జిజ్ఞాస అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. పర్యావరణానికి హాని కలగని ఉత్పత్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అతనే.. అనంతపురం నగర శివారులోని చంద్రబాబు కొట్టాలకు చెందిన బాబా ఫకృద్దీన్‌.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక 9వ తరగతితో చదువు మానేసి.. వాహనాల మరమ్మతుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన బాబా ఫకృద్దీన్‌.. తాను చేస్తున్న ప్రతి పనీ వినూత్నంగా ఉండాలని భావించేవారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో పాటు తొలిసారిగా రివర్స్‌ గేర్‌తో నడిచే త్రిచక్ర వాహనాన్ని రూపొందించి అందరి ప్రశంసలూ అందుకున్నారు. అంతటితో ఆగకుండా యువతను ఉర్రూతలూగించేలా హైబ్రీడ్‌ సైకిల్‌కు  రూపకల్పన చేశారు.   

హల్క్‌ బైసైకిల్‌..  
రూ.56 వేల ఖర్చుతో బాబా ఫకృద్దీన్‌ రూపొందించిన హైబ్రీడ్‌ సైకిల్‌ నేడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సైకిల్‌కు ఏర్పాటు చేసిన 72 ఓల్టుల బ్యాటరీని రెండు నుంచి మూడు గంటల పాటు చార్జింగ్‌ పెట్టడం ద్వారా 3 నుంచి 4 యూనిట్ల విద్యుత్‌ వినియోగమవుతుంది. ఈ లెక్కన రూ.6తో 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రూ.18,600తో కొనుగోలు చేసిన సైకిల్‌కు రూ.29 వేలు విలువైన 72 ఓల్టుల బ్యాటరీని అమర్చారు.

ఎల్‌ఈడీ సెన్సార్, సౌండ్‌ హారన్, చార్జింగ్‌ రీడింగ్, బ్యాటరీ బ్యాక్‌ఆప్‌ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 40 కిలోల బరువున్న ఈ సైకిల్‌పై 120 కిలోల బరువున్న వ్యక్తి సైతం 50 కిలోమీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళ్లవచ్చు. సైకిల్‌కున్న భారీ టైర్ల (26X4) వల్ల కొండ గుట్టలను సునాయాసంగా ఎక్కి దిగవచ్చు.  

మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుంది 
నా ప్రతి ఆవిష్కరణ వెనుక ఒకరి వ్యధభరితమైన జీవితం ఉంది. వారి కోసం ఏదో చేయాలనే తపనే నూతన ఆవిష్కరణలకు కారణమవుతోంది. త్రిచక్ర వాహనాన్ని పార్కింగ్‌ ప్లేస్‌లో వెనక్కు తీసుకునేందుకు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు గమనించి రివర్స్‌ గేర్‌ సదుపాయం ఉన్న వాహనాన్ని రూపొందించాను. ప్రస్తుతం నేను తయారు చేసిన సైకిల్‌ను చూసిన చాలా మంది ముచ్చటపడి హల్క్‌ బైక్‌ అని పేరు పెట్టారు. తగిన ప్రోత్సాహమిస్తే మరిన్ని ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఉంది.    
– బాబా ఫకృద్దీన్, అనంతపురం
 

మరిన్ని వార్తలు