బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు

20 Sep, 2022 09:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడ : బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసిన యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో న్యాయస్థానం (స్పీడ్‌ ట్రయల్‌ కోర్టు) జడ్జి డాక్టర్‌ ఎస్‌.రజిని సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్‌ కరకట్ట ప్రాంతానికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన తన్నీరు నాగార్జున (20) పలుమార్లు అత్యాచారం చేసిన వైనం 2017 ఏప్రిల్‌ 29న వెలుగులోకి వచ్చింది.

అప్పట్లో ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. కేసు విచారణాధికారి విజయవాడ పశ్చిమ పోలీస్‌ డివిజన్‌ ఏసీపీ గుణ్ణం రామకృష్ణ నిందితుడిని అరెస్టుచేసి 2021 మే లో∙చార్జిషీట్‌ దాఖలు చేశారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.వి.నారాయణరెడ్డి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. బాధితురాలికి రూ.4 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారసంస్థను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు