కువైట్‌లో రోడ్డు ప్రమాదం..   కృష్ణంపల్లె వాసి మృతి

19 Feb, 2023 17:44 IST|Sakshi
కొడుకు, కూతురుతో జయరామిరెడ్డి (ఫైల్‌)

సరైన సమాచారం లేక తల్లడిల్లుతున్న బంధువులు

పోరుమామిళ్ల : మండలంలోని చల్లగిరిగెల పంచాయతీ క్రిష్ణంపల్లెకు చెందిన గోపవరం జయరామిరెడ్డి (40) కువైట్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంఘటన జరిగి మూడు రోజులవుతున్నా సరైన సమాచారం లేదని మృతుడి తమ్ముడు దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరధరామిరెడ్డి కథనం మేరకు జయరామిరెడ్డి కువైట్‌లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య 9 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందింది. ఆయనకు రాముకార్తీక్‌రెడ్డి(14), తునుషి కౌసల్య(10) ఇద్దరు పిల్లలు. మూడు రోజుల క్రితం బస్తాల లోడుతో వెళుతున్న జయరామిరెడ్డి లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది.లారీలో ఉన్న జయరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్నవారిలో ముగ్గురు మృతి చెందారు., మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ప్రమాదం గురించి, జయరామిరెడ్డి మృతి గురించి కానీ ఇక్కడకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదు. జయరామిరెడ్డి రెండు రోజులు ఫోన్‌ చేయకపోవడంతో దశరధరామిరెడ్డి ఫోన్‌ చేయడంతో విషయం తెలిసింది. జయరామిరెడ్డి ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన వ్యక్తి ఆయన ప్రమాదంలో చనిపోయారని అరబిక్‌లో చెప్పాడు. దశరధరామిరెడ్డి కూడా గతంలో కువైట్‌లో ఉన్నందున భాష తెలిసి అన్న మృతి చెందాడని అర్థం చేసుకున్నాడు. అన్న పని చేస్తున్న సేట్‌కు ఫోన్‌ చేశాడు. సేట్‌ ప్రమాదంలో జయరామిరెడ్డి చనిపోయాడని, మృతదేహం ఆసుపత్రిలో ఉందని, ప్రాసెస్‌ పూర్తయితే ఇండియాకు పంపిస్తానని చెప్పాడు. రెండు రోజులుగా సేట్‌ నుండి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్‌ చేస్తే ప్రాసెస్‌ జరుగుతున్నదని మాత్రమే చెపుతున్నాడని దశరథరామిరెడ్డి వివరించాడు.

కువైట్‌లో ఉన్న ఆంధ్రా ఎంబసీకానీ, ఆంధ్రా వ్యక్తులు కానీ అందుబాటులోకి రావడం లేదని, సరైన సమాచారం ఎవ్వరూ చెప్పడం లేదని దశరధరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మృతదేహం ఎప్పుడు పంపిస్తారు? ప్రమాదంపై కేసు నమోదు చేశారా? కేసు ఏమని రాశారు? తదితర సమాచారం ఏమీ తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు