వ్యాపారంతో నష్టం.. బాగు చేసిన సాగు

7 Mar, 2023 09:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా ఆకుల గణపవరానికి చెందిన ఓబుల్‌రెడ్డి ఓ సాధారణ వ్యాపారి.  ద్విచక్ర వాహనంపై ఊరూరా తిరుగుతూ ఎలక్ట్రిక్‌ వస్తువులను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వ్యాపారం కలిసిరాక అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం వ్యవసాయం వైపు మళ్లాడు. ఎకరం భూమిని కౌలుకు తీసుకున్నాడు. బహుళ పంటలు పండిస్తే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందని నిరూపిస్తున్నాడు. తొలి మూడేళ్లు పత్తితో పాటు బీర, సొర, దోస, కాకర వంటి కూరగాయలతోపాటు ఆకు కూరలు, బంతి పంటను సాగు చేశాడు. రూ.35 వేల పెట్టుబడితో సాగు చేసి రూ.1.80 లక్షల చొప్పున ఆర్జించాడు. 

విరగ పండిన మిరప 
ఓబుల్‌రెడ్డి ఈ ఏడాది మిరప పంట వేశాడు. నల్ల తామర పురుగు బారిన పడకుండా పంట­ను కాపాడుకునేందుకు వేప గింజల కషాయం, దోమ నివారణకు తూటికాడ కషాయం పిచికారీ చేశాడు. మొక్క ఎదుగుదలకు కోడిగుడ్డు, నిమ్మరస ద్రావణం, చేప, బెల్లం ద్రావణం, తెగుళ్ల నివారణకు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడంతో పంట ఏపుగా ఎదిగింది. కషాయాలు, కలుపుతీత, పీఎండీ విత్తనాలకు రూ.35 వేలు, కోతలకు రూ.1.20 లక్షలు, కౌలు­కు రూ.12 వేల చొప్పున మొత్తం రూ.1.67 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

తొలి కోతలోనే 15 క్వింటాళ్ల  దిగుబడి వచ్చింది. అత్తలూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం మార్కెట్‌ ధర కంటే క్వింటాల్‌కు రూ.3 వేల అద­నంగా చెల్లించి.. రూ.23 వేల చొప్పున కొనుగో­లు చేస్తోంది. మిగిలిన రెండు కోతల్లో మరో 15­నుం­చి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన ఒక్క మిరపకే రూ.7 లక్షల వర­కు ఆదాయం వచ్చే అవకాశం కన్పి­స్తోం­ది. పెట్టుబడి పోను రూ.5.30 లక్షల వరకు మిగులుతుండటంతో ఓబుల్‌రెడ్డి ఆనందానికి అవధులు లేవు. 

 అప్పులన్నీ తీర్చేశా
వ్యాపారం కలిసిరాక అప్పుల పాలయ్యా. భూమిని నమ్ముకుని అప్పులన్నీ తీర్చేశా. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తోంది. రసాయన రహితంగా పండించిన మిరపను కొనేందుకు పోటీ పడుతున్నారు. మంచిరేటు వస్తోంది. పెట్టుబడికి 4 రెట్లు ఆదాయం 
ఆర్జించగలుగుతున్నా.  
– ఓబుల్‌రెడ్డి, గణపవరం, పల్నాడు జిల్లా

మరిన్ని వార్తలు