స్పెల్లింగ్‌ మార్చితే కరోనా మాయమట..!

9 May, 2021 17:20 IST|Sakshi

సాక్షి, అనంతపురం: దేశంలో కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరతతో ఇప్పటికే చాలా మంది మరణించారు. దేశంలోని వైద్యులు 24 గంటల పాటు కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తుండగా, మరోవైపు కొంత మంది మూఢనమ్మకాలపై విశ్వసిస్తున్నారు. కరోనా వైరస్‌ను తమ గ్రామం నుంచి తరిమివేయడం కోసం స్థానిక మహిళలు ప్రజలు దేవుడికి  భారీ సంఖ్యలో ఊరేగింపు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా అనంతపురంకు చెందిన ఓ వ్యక్తి కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూమారాలజీ ప్రకారం కరోనా, కోవిడ్‌-19 లోని స్పెల్లింగ్‌లో కాస్త మార్పులు చేస్తే కరోనా ఇట్టే మాయమవుతుందని కొత్త పల్లవి అందుకున్నాడు. ఇంగ్లీషులో  కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే మార్పును చూడవచ్చునని తెలిపాడు. అతడు స్థానికంగా న్యూమారాలజిస్ట్‌గా పనిచేస్తుంటాడు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా ఓ నెటిజన్‌ ఒకసారి స్పెల్లింగ్‌ మార్పు చేస్తే కరోనా తగ్గిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మరొక నెటిజన్‌ ఎవరి నమ్మకాలు వారివి.. వారు అలా చెప్పారని మనం ఎవరిని కించపరచలేం. మనమైతే కరోనాను జయించడానికి మాస్క్‌ను, భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని తెలిపాడు. 

చదవండి: ఫైర్‌ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది

మరిన్ని వార్తలు