తాగుబోతు భర్తకు ఝలక్‌ ఇచ్చిన భార్య, దాంతో

20 Feb, 2021 11:04 IST|Sakshi
రవిని స్టేషన్‌కు తీసుకెళ్తున్న పోలీసులు

విద్యుత్‌ టవర్‌ ఎక్కిన వ్యక్తి 

పుట్టపర్తి అర్బన్‌: భార్య నుంచి విడాకుల నోటీసు రావడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సుమారు రెండు గంటల పాటు అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు ఆ వ్యక్తి కిందకు రాగా అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ బాబ్జాన్‌ తెలిపిన వివరాలివీ.. పుట్టపర్తి నగర పంచాయతీ బ్రాహ్మణపల్లికి చెందిన రవి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అనంతపురానికి చెందిన లక్ష్మితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది.

తాగుడుకు బానిస కావడంతో లక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది. రోజులు గడుస్తున్నా అతనిలో మార్పు రాకపోవడంతో ఏకంగా విడాకుల నోటీసు పంపింది. దీంతో మనస్థాపానికి గురైన రవి శుక్రవారం సాయంత్రం మామిళ్లకుంట క్రాస్‌లో సమీపంలో మద్యం సేవించి 11కేవీ విద్యుత్‌ టవర్‌ ఎక్కాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విద్యుత్‌ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మెయిన్‌ లైను విద్యుత్‌ సరఫరా నిలిపివేయించి సిబ్బంది పైకి ఎక్కారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. మరింత పైకి వెళ్లాడు. తనకు విడాకులు వద్దని, భార్యే కావాలని భీష్మించాడు. సుమారు రెండు గంటల పాటు అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు కిందకు దిగాడు. అనంతరం అతడిని రూరల్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.
చదవండి: దేవుడికే పంగనామాలు!    
హలో.. 60 సెకన్లలో లోన్‌, చిక్కుకుంటే ముంచేస్తారు..

 

మరిన్ని వార్తలు