60 ఏళ్లుగా సైకిల్‌తో అనుబంధం..

27 Dec, 2020 16:21 IST|Sakshi

ఇప్పటికీ చెక్కుచెదరని సైకిల్

నేటికీ అదే ఆయన వాహనం

ఆయనకు 16 ఏళ్ల వయసులో వివాహమైంది. తండ్రితో సైకిల్‌ కొనిపించారు. ఇప్పుడు ఆయన వయస్సు 76 ఏళ్లు. అప్పుడు కొనుగోలు చేసిన సైకిలే ఇప్పటికీ ఆయన ప్రయాణ రథం. 60 ఏళ్లుగా సైకిల్‌ను చక్కగా చూసుకుంటూ.. ప్రయాణాలకు వినియోగిస్తున్నారు. ఆయన బైస్కిల్‌ బంధం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆదర్శనీయంగా నిలుస్తోంది.  

బొబ్బిలి రూరల్‌ : బొబ్బిలి పట్టణం అగ్రహారం వీధికి చెందిన దామెర శ్రీరంగనాయకులు బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన వారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో ఆయన కూడా వ్యవసాయంపైనే దృష్టిసారించా రు. పెళ్లైన తరువాత బొబ్బిలి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు 16 ఏళ్ల వయసులో 1960 మే 12న వివాహం జరిగింది. మే 20న తండ్రితో మారాం చేసి హెర్క్యులస్‌ సైకిల్‌ను కొనిపించారు. అప్పట్లో సైకిల్‌ ధర 60 రూపాయలు. విజయనగరంలోని చెక్కా వెంకటరత్నం షాపులో కొనుగోలు చేశారు. నాటి నుంచి దానిపైనే బొబ్బిలికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాల్తేరుకు రోజూ రెండు మార్లువెళ్లి వస్తుండేవారు. ఈ సైకిల్‌పై బొబ్బిలి నుంచి పార్వతీపురం, సాలూరు, విజయనగరానికి సినిమా లకు, నాటకాలకు సైతం వెళ్లేవారు. సైకిల్‌పై 60 ఏళ్లుగా వేల కిలోమీటర్లు ప్రయాణం సాగించారు. సైకిల్‌ ఫ్రేమ్, హేండిల్‌బార్, మడ్గర్‌లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈయన ఇటీవల టూవీలర్‌ కొనుగోలు చేశారు. దానిపై ఆసక్తి లేకపోవడంతో కొనుగోలుచేసిన కొద్దిరోజులకే అమ్మేశారు. 

నాకెంతో ఆనందం  
నా హెర్క్యులస్‌ సైకిల్‌ అంటే నాకెంతో ఇష్టం.  దీనిపై అప్పట్లో రోజుకు 120 కిలోమీటర్లు తొక్కి సరదాగా సినిమాలకు వెళ్లేవాడిని. 76 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్‌ తొక్కడమే కారణం.  అప్పటి నుంచి ఇప్పటివరకు సైకిల్‌ చెక్కుచెదరలేదు.  దానిపైనే ప్రతినిత్యం ప్రయాణం సాగిస్తున్నా.  – దామెర శ్రీరంగనాయకులు, బొబ్బిలి  
 

మరిన్ని వార్తలు