లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే..

18 Mar, 2021 09:14 IST|Sakshi
వీఆర్‌ఓ బి.రేణుకారాణి

ఏసీబీకి దొరికిపోయిన మందస వీఆర్‌ఓ రేణుకారాణి

మ్యుటేషన్‌కు రూ.3వేలు డిమాండ్‌

తహసీల్దార్‌ కార్యాలయంలోనే వల వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు

సాక్షి, శ్రీకాకుళం: మ్యుటేషన్‌ కోసం లంచం డిమాండ్‌ చేసిన మందస వీఆర్‌ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మందస మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ప్రభాకర్‌ పండాకు బుడారిసింగి పంచాయతీలో 67 సెంట్ల భూమి ఉంది. ఆయన మృతి చెందడంతో కుమారుడు రాజేష్‌పండా తన తండ్రి పేరున ఉ న్న భూమికి మ్యుటేషన్‌ కావాలని పది రోజుల కిందట సోంపేట మండలంలోని కొర్లాంలో గల మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి వీఆర్‌ఓ బి.రేణుకారాణి రంగంలోకి దిగారు. రూ.3వేలు లంచం ఇస్తే గానీ పని జరగదని రాజేష్‌ పండాకు తేల్చి చెప్పారు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు.

బాధితుడి వాదనలు విన్న ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి మందస తహసీల్దార్‌ కార్యాలయంలోనే వీఆర్వోను పట్టుకునేందుకు ప్లాన్‌ వేశారు. సీఐలు భాస్కరరావు, హరి, ఎస్‌ఐలు సత్యారావు, చిన్నంనాయుడులతో పాటు సుమారు 15 మంది సిబ్బంది బుధవారం మందస తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని మాటు వేశారు. రాజేష్‌పండా నగదును వీఆర్వో రేణుకారాణికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పటి నుంచో తహసీల్దార్‌ కార్యాలయంపై ఆరోపణలు వినిపిస్తుండగా, వీఆర్వో అదే కార్యాలయంలో దొరికిపోవడంతో స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగిచింది. 

మందస తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన వీఆర్‌ఓ బి.రేణుకారాణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఆమెను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం. అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది అవినీతిపై బాధితులు ఏసీబీకి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జీతం ఇస్తోంది. అవినీతికి పాల్పడితే ఎవ్వరైనా ఉపేక్షించం. 14400 అనే నంబరు కు గానీ, ఏసీబీ డీఎస్పీ 9440446124, సీఐలు 7382629272, 9440446177 అనే నంబర్లకు ఫిర్యాదు చేయాలి. లంచం తీసుకోవడం, ఇవ్వడమూ నేరమే. బాధితులకు ఏసీబీ అండగా ఉంటుంది.
 – బీఎస్‌ఎస్‌వీ రమణమూర్తి, డీఎస్పీ, యాంటీ కరప్షన్‌ బ్యూరో

చదవండి: 
భార్యపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన భర్త

మరిన్ని వార్తలు