Cyclone Mandous Updates: మరింత తీవ్రంగా మాండూస్‌ తుపాను.. ప్రచండ గాలులతో పాటు భారీ వర్షాలు కూడా!

9 Dec, 2022 20:45 IST|Sakshi

వైఎస్సార్‌ కడప జిల్లా:
తుఫాను, భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు కలెక్టర్‌ విజయ రామరాజు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుఫాను బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. జిల్లా కలెక్టరేట్  కార్యాలయంతో పాటు  కడప, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

జిల్లా కలెక్టరేట్  కార్యాలయం కంట్రోల్ రూమ్-08562 - 246344
కడప రెవెన్యూ డివిజన్.. కంట్రోల్ రూమ్-08562 - 295990
జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్ -9440767485 
బద్వేలు రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్-9182160052
పులివెందుల రెవెన్యూ డివిజన్ కంట్రోల్ రూమ్- 7396167368

కొనసాగుతున్న మాండూస్ తుఫాను
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండూస్ తుఫాను కొనసాగుతుంది. మామల్లపురంకి 135 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి 170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది. ఈ అర్థరాత్రి, తెల్లవారుజామున శ్రీహరికోట మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది.

దీని ప్రభావం వలన రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, సత్య సాయి జిల్లా, వైఎస్సార్‌, ప్రకాశం జిల్లాలకు భారీ వర్ష సూచన. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు: మంత్రి కాకాణి
తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాం. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎండీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

నెల్లూరు జిల్లా 
►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు 
►అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 
►ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి 
►తీరప్రాంత మండలాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన మంత్రి కాకాణి

తిరుపతి జిల్లా
►బంగాళాఖాతంలో ఏర్పడిన  మాండూస్ తుఫాను ప్రభావంతో  అప్రమత్తంగా ఉండాలి: నగర పాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి 
►ఇప్పటివరకు తిరుపతి నగరంలో 10 లోతట్టు ప్రాంతాలను గుర్తించాం
►లోతట్టు ప్రాంతాల్లో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని పిలుపు
►నగర పాలక సంస్థ తరపున హెల్ప్ లైన్ నంబర్  ఏర్పాటు చేశాం

తూర్పుగోదావరి జిల్లా
►మాండూస్ తుఫాన్  ప్రభావంతో గోదావరి జిల్లాల్లో మారిన వాతావరణం
►మేఘావృతంగా మారిన ఆకాశం పలు చోట్ల మోస్తరు వర్షం
►ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో ఎగసిపడుతున్న అలలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
►మాండూస్ తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారుతున్న సముద్రం
►అంతర్వేది, ఓడల రేవు తీరాల్లో స్వల్పంగా ఎగసిపడుతున్న అలలు
►వాతావరణశాఖ హెచ్చరికలతో తీరానికి వచ్చేస్తున్న మత్స్యకారులు
►జిల్లా కేంద్రంతో పాటు, తీర ప్రాంతంలో మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేసిన అధికారులు

కాకినాడ జిల్లా
►మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్.. కల్లోలంగా మారిన ఉప్పాడ తీరం
►కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డు పై ఎగసిపడుతున్న కెరటాలు
►పది మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం
►అధికారుల హెచ్చరికలతో వేటను ఇవాళ, రేపు నిలిపివేసిన మత్స్యకారులు

తిరుపతి జిల్లా 
► నేటి మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు: జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి
►బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మాండూస్ తుఫానుగా మారిన  నేపథ్యంలో నేటి మధ్యాహ్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనంతరం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవుగా ప్రకటన.. జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి 
►సంబంధిత పాఠశాలలు కళాశాలలు వాటి యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని ఆదేశం

నెల్లూరుకు పొంచి ఉన్న మాండూస్ తుపాను ముప్పు 
►జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్ చక్రధర్ బాబు 
►తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం 
►కలెక్టరేట్‌తో పాటు ,అన్ని మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు 
►ఆస్తి, ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన 
►పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ చక్రధర్ బాబు

చిత్తూరు
►జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ
►పాఠశాల పునఃప్రారంభంపై తిరిగి సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

తిరుపతి జిల్లాపై మాండూస్‌ తుపాను ప్రభావం
►మాండుస్ తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు
►తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆ మోస్తరుగా చిరుజల్లులు


►సముద్రతీర ప్రాంత మండలాలు తడ, సూళ్ళురు పేట,వాకాడు,కోట, లో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం
►మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసిన రెవెన్యూ యంత్రాంగం
►ఈరోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ అలెర్ట్
►తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం

సాక్షి, చెన్నై/అమరావతి: మాండూస్‌ తుపాను ప్రభావంతో.. పలు పోర్టుల్లో తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. కడలూరు, పుదుచ్చేరి, నాగపట్నం, కారైకల్‌.. ఓడరేవుల్లో ఐదవ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. పార్క్‌లు, బీచ్‌లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

బంగాళాఖాతంలో మాండూస్‌ తుపాను కేంద్రీకృతం. సాయంత్రం కల్లా మహాబలిపురం-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది మాండూస్‌. తుపాను తాకే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి,  ఏపీకి సంబంధించి.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుపాను ప్రభావం పడనుంది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు భారీ వర్ష సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నిచోట్లా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధమని అధికార యంత్రాంగాలు ప్రకటించాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం  అర్దరాత్రి  తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల పుదుచ్చేరి, శ్రీహరికోట, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట 65 కిలోమీటర్ల నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ సూచించారు.  రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్‌ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు.

మరిన్ని వార్తలు