మమతల కోవెలలు.. మండువా లోగిళ్లు 

28 Jan, 2023 17:52 IST|Sakshi

వందేళ్లు దాటినా చెక్కు చెదరని కట్టడాలు

గాలి, వెలుతురు వచ్చేలా అందమైన నిర్మాణాలు

ఉభయగోదావరి జిల్లాల్లో 200కు పైగానే మండువాలు

ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణంలా.. మమతానురాగాలకు కోవెలలుగా మండువా లోగిళ్లు నిలుస్తున్నాయి.. వందేళ్లు దాటినా నేటికీ చెక్కుచెదరకుండా ఠీవిగా దర్శనమిస్తున్నాయి.. అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.. ఉభయగోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాల్లో మండువా లోగిళ్లు అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమగోదావరితో పాటు కోనసీమ ప్రాంతాల్లో 200కు పైగా కనిపిస్తున్నాయి.   

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నియోజకవర్గ పరిధిలోని రేలంగి, సమీప గ్రామాలతోపాటు ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర, పోడూరు, ఆచంట, పాలకొల్లు నియో జకవర్గ పరిధిలోని యలమంచిలి, వేడంగి, భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం తదితర మండలాల్లోని అనేక గ్రామాల్లో మండువా లోగిళ్లు దర్శనమిస్తున్నాయి. నేటికీ అనేక సినిమాలు ఇక్కడి మండువా లోగిళ్లలోనే షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి.


పోడూరులో 1916 నాటి మండువా  
 
నాణ్యతలో మేటిగా.. 
పూర్వం సంపన్నులు, ఉమ్మడి కుటుంబాల వారు ఎక్కువగా మండువా లోగిళ్లను నిర్మించుకునేవారు. అప్పట్లో 300 గజాల స్థలంలో ఇలాంటి ఇళ్లు నిర్మించడానికి రూ.30 వేలు, వెయ్యి గజాల్లో నిర్మించడానికి రూ.70 వేల వరకు ఖర్చయ్యేదని చెబుతారు. ప్రధానంగా పాటిమట్టి, గానుగ సున్నంతో 3, 4 అడుగుల వెడల్పు గోడలతో ఎంతో విశాలంగా, పటిష్టంగా వీటిని నిర్మించేవారు. వీటికి పెంకులతో కూడిన పైకప్పులు వేసేవారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే విశాలమైన హాలునే మండువా అనేవారు. ఆ హాలు చుట్టూ 3 వైపులా ఉమ్మడి కుటుంబాలు ఉండేలా గదులను పోర్షన్లుగా నిర్మించేవారు. ప్రతి పోర్షన్‌కు పైన నాణ్యమైన కలపతో చేసిన మిద్దెలు అత్యంత విశాలంగా ఉంటాయి. ఈ మిద్దెలను స్టోర్‌ రూమ్‌లుగా వాడేవారు. అలాగే వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు.. బందిపోటు దొంగల భయం ఉన్నపుడు నివసించేందుకు వీలుగా వీటిని ముందుచూపుతో నిర్మించేవారని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు. 


వేడంగిలో సుమారు 150 ఏళ్ల నాటి మండువా లోగిలి

గాలి, వెలుతురు, చల్లదనం పుష్కలం 
ఈ ఇళ్లల్లో గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా కిటికీలు ఎక్కువగా పెట్టేవారు. అలాగే మండువా హాలులో పైకప్పును నాలుగైదు అడుగుల మేర చతురస్రాకారంలో ఖాళీగా ఉంచేవారు. ఇంటికి ఉండే కిటికీల నుంచే కాకుండా ఈ ఖాళీ ప్రదేశం నుంచి సూర్యరశ్మి, గాలి, వెలుతురు పుష్కలంగా వస్తుంది. ఇక్కడ నుంచి వర్షం నీరు నేరుగా కింద పడుతుంది. కొంతమంది వర్షం నీరు బయటకు వెళ్లేలా పైపును అమర్చేవారు. అవసరాన్ని బట్టి కొన్ని ఇళ్లను రెండు మండువాలతో నిర్మించేవారు. పూర్వం నిర్మించిన ఈ మండువా లోగిళ్లకు ఎక్కువగా బర్మా టేకు, బర్మా మద్ది (నల్లమద్ది)ని వినియోగించేవారు. ప్రధాన ద్వారాలు భారీగా ఉండటంతోపాటు ప్రధాన ద్వారంపై, నిలువు స్థంభాలపై ఎంతో అందమైన, ఆకర్షణీయమైన కళాత్మక రూపాలు చెక్కించేవారు. ఈ మండువా లోగిళ్లకు ఇవే ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పెంకుటి పైకప్పుతో ఉండడం వల్ల వేసవికాలంలో కూడా ఈ ఇళ్లు చల్లదనంతో ఉంటాయి. 

నిర్వహణ ఖర్చు అధికమే.. 
ప్రస్తుతం మండువా ఇళ్లను పరిరక్షించడం భారీ ఖర్చుతో కూడుకున్నప్పటికీ 5, 6 తరాలకు చిహ్నాలుగా ఉన్న ఇళ్లను కుటుంబీకులు పరిరక్షించుకుంటున్నారు. ప్రధానంగా కలప చెద పట్టకుండా నాలుగు లేదా ఐదేళ్లకు ఒకసారి స్ప్రే చేయించడం, కిటికీలు, తలుపులు, మిద్దె పైకప్పులను తరుచూ శుభ్రం చేయించడం, నాలుగేళ్లకు ఒకసారి పెంకులను అవసరమైన మేరకు మార్చడం చేస్తున్నారు. 

మాది ఏడో తరం  
ఈ ఇల్లు దాదాపు 125 ఏళ్ల క్రితం నిర్మించారు. మాది 7వ తరం. ఇప్పటికీ మా ఇల్లు పటిష్టంగానే ఉంది. చిన్న, చిన్న మరమ్మతులు చేయించాం. నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నా పూర్వీకులు ఇచ్చిన ఇల్లు కావడంతో పాడవకుండా రక్షించుకుంటున్నాం 
– చేకూరి సుబ్బరాజు, పోడూరు 
 
120 ఏళ్ల క్రితం ఇల్లు మాది  
మా ఇల్లు నిర్మించి సుమారు 120 ఏళ్లవుతోంది. మా మనవలతో లెక్కేస్తే 8వ తరం ఇంట్లో ఉంటున్నట్లు. ఇంకో 50 ఏళ్లయినా అలాగే ఉంటుంది. పెంకుటిల్లు కావడంతో ముఖ్యంగా పెంకు నిలబడే రిఫర్‌ దెబ్బతినకుండా చూసుకోవాలి. 3, 4 ఏళ్లకు ఒకసారి అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. 
– ఆర్‌ఎస్‌ రాజు, పోడూరు

మరిన్ని వార్తలు