యంగ్‌ సైంటిస్ట్‌ శిక్షణకు మంగమూరు విద్యార్థి 

26 Apr, 2022 09:26 IST|Sakshi
మట్టింగుంట క్రాంతికుమార్‌

ఒంగోలు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహించనున్న యంగ్‌ సైంటిస్ట్‌ శిక్షణకు మంగమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి మట్టిగుంట క్రాంతికుమార్‌ ఎంపికయ్యాడు. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కులు, 8వ తరగతి మార్కులు, సైన్స్‌ ఫెయిర్, ఒలంపియాడ్‌ పరీక్షలు, క్విజ్, క్రీడలు తదితర అంశాల్లో చూపిన ప్రతిభను పరిగణలోకి తీసుకున్న ఇస్రో.. యువికా–2022కు క్రాంతికుమార్‌ను ఎంపిక చేసింది.

దేశం మొత్తం మీద 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురికి చోటుదక్కింది. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ను డీఈవో బి.విజయభాస్కర్, ఉప విద్యాశాఖ అధికారి అనితా రోజ్‌మేరీ, పాఠశాల హెచ్‌ఎం బి.సుధాకరరావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో రిపోర్టు చేయాలని ఇప్పటికే విద్యార్థికి ఆదేశాలు అందాయి.

గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇస్తూ యువ విద్యార్థులకు స్పేస్‌ టెక్నాలజీ, స్పేస్‌ సైన్స్‌ మరియు స్పేస్‌ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని పెంపొందించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యంగ్‌ సైంటిస్ట్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 

ఈ వార్త కూడా చదవండి: చురుగ్గా 44వ విడత ఫీవర్‌ సర్వే

మరిన్ని వార్తలు