మామిడి రైతుకు నిరాశే 

3 Jun, 2022 18:22 IST|Sakshi

ఈ ఏడాది భారీగా తగ్గిన దిగుబడి

ఎగుమతులు లేక వెలవెల

ఆందోళనలో రైతులు, వ్యాపారులు

నూజివీడు/ చింతలపూడి : ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి, కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మామిడి పరిశ్రమ ఈ ఏడాది రైతులు, వ్యాపారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడి ఎగుమతుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్‌ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలు ఉండటం విశేషం. మిగిలిన ఏడు వేల ఎకరాలు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి.  

దెబ్బతీసిన నల్ల తామర 
గత రెండేళ్లు కరోనాతో దెబ్బతిన్న రైతులు, ఈ ఏడాది కొత్తగా ఆశించిన నల్లతామర వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. సంక్రాంతి తరువాత తోటల్లో పూత ఉద్ధృతంగా వచ్చినప్పటికీ నల్లతామర పురుగు ఆశించడంతో పూత అంతా మాడిపోయి కేవలం కాడలే మిగిలాయి. దీని ప్రభావం దిగుబడిపై çపడింది. సాధారణంతో పోల్చితే సగం కూడా దిగుబడి రాలేదు. అరకొరగా వచ్చిన దిగుబడికి సరైన ధర లభించకపోవడంతో మామిడిపై  రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.   

భారీగా తగ్గిన ఎగుమతులు 
ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి కోల్‌కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వేలకొద్ది లారీల్లో నాణ్యమైన మామిడి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది సీజన్‌ ముగింపు దశకు వచ్చినా ఎగుమతులు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.  ఏటా ఒక్క నూజివీడు ప్రాంతం నుంచే రోజుకు దాదాపు 350 నుంచి 400 లారీల మామిడి ఎగుమతులు జరి గేవి. ఈ ఏడాది ఎగుమతులు రోజుకు 150 లారీలకు పడిపోయాయి. చింతలపూడి ప్రాంతం నుంచి రోజుకు 25 లారీల ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 నుంచి 12 లారీలకు పడిపోయాయి. దీనిని బట్టి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు.  

సిండికేట్‌తో పడిపోయిన ధరలు 
ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగుంటుందని రైతులు భావించారు. రైతుల ఆశలను ఢిల్లీ వ్యాపారులు ప్రతిఏటా మాదిరిగానే  అడియాస చేశారు. వారంతా సిండికేట్‌ అయ్యి ధరను తమకు కావాల్సిన విధంగా పెంచడం, తగ్గించడం చేస్తూ రైతులతో ఆడుకున్నారు. దీంతో దిగుబడి తక్కువగా ఉన్నా ధర మాత్రం రోజురోజుకూ దారుణంగా పతనమైంది. మామిడి సీజన్‌ ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారం, మార్చి తొలి వారంలో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, కలెక్టర్‌ (తోతాపురి) రకం రూ.90 వేలకు కొనుగోలు చేసిన ఢిల్లీ వ్యాపారులు దిగుబడి పూర్తిస్థాయిలో వచ్చే సమయాల్లో అతి దారుణంగా ధరను పతనం చేశారు. ఆ తరువాత సీజన్‌ గడుస్తున్న కొద్దీ తగ్గుకుంటూ వచ్చి చివరకు బంగినపల్లి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలో నిలబడింది. కలెక్టర్‌ రకం ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల మధ్య నడుస్తోంది.  

ఢిల్లీ వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు 
ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దారుణంగా తగ్గించి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ధర బాగున్నప్పటికీ సీజన్‌ గడుస్తున్న కొద్దీ ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టాలపాలయ్యారు.   
– మూల్పురి నాగవల్లేశ్వరరావు, మామిడి రైతు, నూజివీడు 

నష్టాలు తప్పువు 
ఈ ఏడాది మామిడి రైతుకు నష్టాలు తప్పవు. మంగు తెగులు కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే గానీ నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగులుతుంది.  
– చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్‌ వ్యాపారి, చింతలపూడి 

మరిన్ని వార్తలు