మామిడి రైతులకు కాసుల పంట

26 Jul, 2022 04:35 IST|Sakshi
వివిధ రకాల మామిడి కాయల ధర(టన్నుకు రూపాయల్లో)

చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ధరలు 

టన్ను రూ.90 వేలు పలుకుతున్న తోతాపురి, అల్ఫాన్సా

ఏకంగా రూ.1.20 లక్షలు పలికిన మల్లిక

సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది చిత్తూరు జిల్లా మామిడి రైతుల పంట పండింది. తోతాపురి, బేనీషా, మల్లిక, అల్ఫాన్సా తదితర రకాలకు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. చిత్తూరు జిల్లాలోని రైతులు అధిక శాతం.. మామిడి పంటను సాగు చేస్తున్నారు. సకాలంలో చెట్లకు పూత వచ్చి మంచి దిగుబడి వస్తే అన్ని రకాల కాయలు కలిసి దాదాపు 8 లక్షల నుంచి 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పుల వల్ల నెల రోజులు ఆలస్యంగా చెట్లకు పూత వచ్చింది. దీంతో కోత ఆలస్యమై.. దిగుబడిపై ప్రభావం పడింది. దీనికితోడు మే, జూన్‌ నెలల్లో కురిసిన వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి.

పక్వానికి రాక ముందే కొంత మేర కాయలు నేలపాలయ్యాయి. జిల్లాలో 68,479 హెక్టార్లలో వివిధ రకాల మామిడి సాగు చేయగా.. 4,49,042 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు సీజనుకు ముందే కాయలను మార్కెట్లకు తరలించారు. ప్రారంభంలో ధర లేకపోయినా అయినకాడికి అమ్మేసుకున్నారు. మిగిలిన రైతులకు నెల రోజులుగా కాసుల వర్షం కురుస్తోంది. దిగుబడి తక్కువ వచ్చిందని బాధలో ఉన్న వారు.. ఇప్పుడు రికార్డు ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల వ్యాపారులు రావడంతో.. 
కాయలు నాణ్యంగా ఉండటంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో ధరలు అమాంతం పెరిగాయి. తోతాపురి, అల్ఫాన్సా రకాలకు టన్నుకు రూ.90 వేలు ధర పలికింది. ఇక మల్లిక రకానికి ఏకంగా రూ.1.2 లక్షల ధర పలికింది. వచ్చే ఏడాది కూడా మంచి ధర రావాలంటే ప్రతి రైతు పచ్చిరొట్ట తప్పనిసరిగా సాగు చేయాలి. 
– మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖాధికారి

ఈస్థాయి ధర ఎప్పుడూ చూడలేదు..
గత 50 ఏళ్లలో ఈస్థాయి ధరలు ఎప్పుడూ రాలేదు. భవిష్యత్‌లో కూడా వస్తుందో.. రాదో చెప్పలేం. పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. ఎకరాకు 10 టన్నులు రావాల్సింది. వర్షాల వల్ల ఈసారి మూడు, నాలుగు టన్నులే వచ్చాయి. దీంతో బాధలో ఉన్న మాకు.. రికార్డు ధరలు రావడం చాలా సంతోషంగా ఉంది.     
– రవీంద్రనాథ్, పాలమాకులపల్లె, బంగారుపాళెం మండలం 

మరిన్ని వార్తలు