AP Farmers: ఆంధ్రా మామిడి ‘అదుర్స్‌’.. రికార్డు స్థాయిలో..

19 Mar, 2022 09:34 IST|Sakshi

భారీగా ధర పలుకుతున్న బంగినపల్లి

టన్ను  రూ.1.30 లక్షలు

తోటల వద్దకు వచ్చి నేరుగా కొనుగోలు

ఉత్తరాది రాష్ట్రాలు, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి

గతేడాది టన్ను రూ.లక్ష

నాణ్యత పెరగడంతో ఈ ఏడాది మరింత పెరిగిన ధర

వైఎస్సార్‌ తోటబడులు, ఫ్రూట్‌ కేర్‌ విధానాలతో నాణ్యత పెరిగిందంటున్న రైతులు

సాక్షి, అమరావతి: మామిడి సీజన్‌ రైతులకు మంచి ‘ఫలాల’తో మొదలైంది. ప్రభుత్వ చర్యలు, రైతులకు ఇచ్చిన సలహాలతో మంచి నాణ్యత కలిగిన పండ్లు వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. వివిధ రాష్ట్రాల వ్యాపారులు తోటల వద్దకు వచ్చి మరీ కొంటున్నారు. గతేడాది టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష పలికిన బంగినపల్లి ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతోంది. కృష్ణాజిల్లాలో రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన నాణ్యమైన మామిడి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు.

చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం

గత రెండేళ్లూ మామిడి మార్కెట్‌ను కరోనా దెబ్బ తీసింది. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈసారి కాస్త మంచి రేటు వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో ఆరంభంలోనే రికార్డు స్థాయి ధర పలకడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలో పండే బంగినపల్లి , సువర్ణరేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్‌ ఉంది. ఎగుమతుల కోసం ఇప్పటికే 18,486 మంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ ఏడాది 3.35 లక్షల హెక్టార్లలో మామిడి సాగవగా, హెక్టార్‌కు గరిష్టంగా 12 టన్నుల చొప్పున 40.26 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు.

సత్ఫలితాలిస్తున్న తోటబడులు
ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ తోట బడుల కార్యక్రమంతో పాటు ఫ్రూట్‌ కేర్‌ విధానాల వల్ల దిగు బడుల్లో నాణ్యత పెరిగింది. కాయ రెట్టింపు సైజు వచ్చి, బరువు కూడా పెరిగింది. సాధారణంగా కిలోకి 4, 5 కాయలు తూగుతాయి. ఫ్రూట్‌కేర్‌ విధానం వల్ల కిలోకి రెండుకు మించి తూగడంలేదు. బుట్ట కట్టడం వలన తెగుళ్లు సోకడంలేదు. పురుగుల మందులు వాడే అవకాశం లేదు. మచ్చలు లేవు. తద్వారా నాణ్యత పెరుగుతోంది. తెలంగాణ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బాగుండటంతో రేటు పెంచేందుకు కూడా వెనుకాడటం లేదు.

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగుంట గ్రామానికి చెందిన రైతు చేబ్రోలు శ్రీనివాసరావుకు 20 ఎకరాల మామిడి తోటలున్నాయి. మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. వైఎస్సార్‌ తోట బడుల్లో అధికారుల సలహాలు పాటించారు. ఫ్రూట్‌కేర్‌ విధానంలో పండ్లకు బుట్టలు కట్టారు. తెగుళ్లు సోకలేదు, మందులు వాడలేదు. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తోంది. నాణ్యత పెరగడంతో మంచి ధర పలికింది. తెలంగాణకు చెందిన వ్యాపారులు టన్ను రూ.1.30 లక్షల చొప్పున 2 టన్నులు కొన్నారు. ఢిల్లీ వ్యాపారులు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 6 టన్నులు, ముంబై వ్యాపారులు రూ.1.15 లక్షల చొప్పున 5 టన్నులు కొన్నారు. ఇంత ధర గతంలో లేదని శ్రీనివాసరావు తెలిపారు. 

టన్ను రూ.1.20 లక్షలకు అమ్మాం
మాకు ఆరెకరాల మామిడి తోట ఉంది. ఫ్రూట్‌కేర్‌ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగింది. గతేడాది గరిష్టంగా టన్ను రూ.లక్ష పలికింది. ఈ ఏడాది టన్ను రూ.1.20 లక్షలు పలికింది. ఇటీవలే 5 టన్నులు అమ్మాం. వ్యాపారులు తోటకే వచ్చి 
పట్టుకెళ్లారు.
– సీహెచ్, కృపారాజు, రెడ్డికుంట, కృష్ణా జిల్లా

పండ్ల నాణ్యత బాగుంది
ఏపీలో ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఫ్రూట్‌ కేర్‌ విధానాలు పాటిస్తుండడం వలన పండ్ల నాణ్యత పెరిగింది. ఏ ఒక్క కాయమీద మచ్చ కన్పించలేదు. మంచి సైజు వస్తోంది. రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 10 టన్నులు కొన్నాం. మరో 20 టన్నులు రూ.80 వేల నుంచి రూ.లక్ష చొప్పున కొన్నాం. ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాలకు ఎగుమతి చేస్తాం.
– మహ్మద్‌ అబ్దుల్‌ అలీమ్, ఆల్‌ నఫే ఫ్రూట్‌ కంపెనీ

త్వరలో బయ్యర్స్‌–సెల్లర్స్‌ మీట్‌
వైఎస్సార్‌ తోట బడులు ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇస్తుండటంతో మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఏడాది ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్‌– సెల్లర్స్‌ మీట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-ఎస్‌ఎస్‌ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ


 

మరిన్ని వార్తలు