విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతలు

17 Aug, 2020 10:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటి వరకు సీపీగా పని చేసిన రాజీవ్ కుమార్ మీనా నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటి వరకు ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా పనిచేశారు. డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సీపీని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

మెరుగైన సేవలు అందిస్తాం: మనీష్ కుమార్ సిన్హా
బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ మాట్లాడుతూ విశాఖపట్నం చాలా ప్రశాంత నగరం అని, అదే ప్రశాంతత కొనసాగించే విధంగా ముందుకెళ్తామన్నారు. నగరంలో పోలీస్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. గతంలో ఎలాంటి సేవలు అందించారో అలాంటి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. అక్రమార్కులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.

ప్రజల సహకారం మరువలేనిది: ఆర్కే మీనా
మాజీ సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ ఏడాది పాటు విశాఖ లాంటి ప్రశాంతనగరంలో పనిచేయడం ఆనందంగా ఉందని తెలిపారు. విశాఖ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు