ఊళ్లల్లో కనుమరుగవుతున్న మెకానిక్‌ దుకాణాలు.. అదే కారణమా!

21 Sep, 2022 20:23 IST|Sakshi

రోడ్డుపై వాహనం మొరాయిస్తే అంతే సంగతులు

మెకానిక్‌ వృత్తి నేర్చుకునే యువత కరువు

సర్వీసు సెంటర్లే వాహనచోదకులకు దిక్కు.. 

సామర్లకోట(కాకినాడ జిల్లా): భార్యా పిల్లలతో ఏ శుభ కార్యానికో, వ్యాహ్యాళికో వెళ్తున్న వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం ఏదో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. కనుచూపు మేరలో మెకానిక్‌ షాపులు లేవు. భార్య బిడ్డలను ఆటోలో చేరాల్సిన చోటుకు పంపి అతడి వాహనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు. రెండు మైళ్లు చెమటోడ్చి వెళ్లాక.. ఏవో చిన్న పరికరాలు పెట్టుకుని ఓ చిన్న బండికి మరమ్మతు చేస్తున్నాడు 60కి దగ్గరలో ఉన్న వ్యక్తి. అసలే గ్రామీణ వాతావరణం. ఆపై మొండిగా తిరిగే బళ్లు. నట్లు, బోల్టులు పట్టేశాయి. వాటిని విప్పడానికి అతని శక్తి చాలడం లేదు. సత్తువ ఉన్న సహాయకుడు ఉంటే కొంత వెసులుబాటు ఉండేది. అదీ లేదు. బండిని తోసుకు రావడంతో సోష వచ్చి అక్కడే కూలబడ్డాడు వెంకటేశ్వర్లు. ఎప్పటికైతే అప్పుడే అవుతుందని కూర్చున్నాడు. ఇదీ ప్రస్తుతం మెకానిక్‌ దుకాణాలు, వాహన చోదకుల పరిస్థితి.  

సామర్లకోట మండల పరిధిలో సుమారు 70 వరకు మోటారు సైకిల్‌ మెకానిక్‌ షాపులు ఉన్నాయి. వీటిలో 20 షాపుల్లో మాత్రమే హెల్పర్లు ఉండగా, మిగిలిన వాటిలో దుకాణ యజమానులే మరమ్మతులు చేస్తున్నారు. కాగా ఆ 50 మందిలో 30 మంది 50 ఏళ్లు దాటిన వారే. చేసే ఓపిక లేకపోతే ఇంట సేదతీరడం తప్ప మరో పని చేయలేని పరిస్థితి వారిది. గతంలో ఏ మెకానిక్‌ దుకాణం చూసినా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు సహాయకులుగా ఉండి బళ్ల మరమ్మతులు నేర్చుకునేవారు. చురుకైనవారైతే ఏడాదిలోనే పని నేర్చేసుకుని వేరే దుకాణం పెట్టేసేవాడు. మళ్లీ అతడి దగ్గరకి సహాయకులు చేరిక.. ఇలా సాగేది. 

నేటి పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది. బడి ఈడు పిల్లలు బడిలోకే వెళ్లాలి. పనిముట్లు పట్టరాదు అనే నినాదంతో ఏ చిన్నారీ బాల్యాన్ని బాదరబందీ బతుకులకు బలిచేయకూడదని, ఏ ఒక్కరైనా భావి భారత పౌరుడిగా జాతి ఔన్నత్యాన్ని నిలిపేలా తయారు కాకపోతాడా అనే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దీంతో చిన్నారులు బడిబాట పడుతుంటే, సహాయకులు లేక, పని నేర్చుకునేవారు లేక మెకానిక్‌ దుకాణాలు కాలక్రమంలో అంతకంతకూ తగ్గిపోతున్నాయి. దీంతో వెంకటేశ్వర్లు లాంటి వాహన చోదకులకు అవస్థలు తప్పడం లేదు.  

ఏ చిన్న సమస్యకైనా సర్వీస్‌ సెంటర్‌కి వెళ్లాలంటే మరమ్మతు చార్జీతో పాటు అదనపు చార్జీలు వేసి చేటంత బిల్లు ఇస్తారు. గ్రామీణులు భరించలేని పరిస్థితి ఇది. వాహనం కొన్నప్పుడు ఇచ్చే ఫ్రీ సర్వీసులనే ఎవరూ చేయించుకోరు. నమ్మకస్తులైన సొంత మెకానిక్‌లతో సర్వీస్‌ చేయించుకుంటారు చాలామంది. పైగా సర్వీస్‌ సెంటర్లు కూడా దూరాభారం. వాహన చోదకుల సమస్యలకు ఆయా యాజమాన్యాలు సర్వీస్‌ సెంటర్లను గ్రామీణ స్థాయికి విస్తరించడం ఒకటే మార్గంగా కనిపిస్తోంది.


వృత్తి విద్య శిక్షణ ఏర్పాటు చేయాలి.. 

ఇప్పటికే గృహ నిర్మాణ రంగంలో అనేక మందికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ కోర్సు లో మోటారు సైకిలు మెకానిక్‌పై కూడా కోర్సును ఏర్పాటు చేయాలి. సర్టిఫికెట్ల ఆధారంగా ఆయా మోటారు సైకిల్‌ సంస్థల్లో చేరే వీలుంటుంది. ఆసక్తి ఉన్న వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. 
– ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట 


హెల్పర్లు లేకపోతే షాపుల నిర్వహణ కష్టం 

సహాయకులు లేకపోతే మెకానిక్‌ షాపుల నిర్వహణ కష్టమే. గతంలో పిల్లలు పని నేర్చుకోడానికి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏదైనా వృత్తి విద్యా కోర్సుల ద్వారా ప్రాథమిక విషయాలు తెలుసుకున్న వారు తమ అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారికీ, మాకూ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 
– ఆండ్ర నూకరాజు, సీనియర్‌ మెకానిక్, సామర్లకోట

మరిన్ని వార్తలు