మాన్సాస్‌ కార్యాలయం ముట్టడి 

18 Jul, 2021 03:38 IST|Sakshi
మాన్సాస్‌ ఈవో వెంకటేశ్వరరావుతో వాగ్వాదానికి దిగిన ఉద్యోగులు

జీతాలు చెల్లించాలంటూ ట్రస్టు ఈవోని నిలదీసిన ఉద్యోగులు

విజయనగరం టౌన్‌: మాన్సాస్‌ (మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఫర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌) విద్యా సంస్థల ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యంపై నిరసన తెలిపారు. మ.2 నుంచి సా.6.30 గంటల వరకు కోటలోని మాన్సాస్‌ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవో వెంకటేశ్వరరావును నిలదీశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్యాసంస్థల సిబ్బందికి జీతాలిచ్చేది మాన్సాస్‌ కరస్పాండెంట్, సీఎఫ్‌వో లేనని, తాను కాదని తెలిపారు. జీతాల చెల్లింపులో జాప్యంపై ఇప్పటివరకు కరస్పాండెంట్‌ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు.

జీతాలిచ్చే కరస్పాండెంట్‌తో పాటు జాయింట్‌ సంతకాన్ని సీఎఫ్‌వో పెడతారని, వారిద్దరూ కలిసి జీతం చెక్‌పై సంతకం చేయాలన్నారు. తాము ఏటా రూ.మూడున్నర కోట్లను సపోర్టింగ్‌ ఫండ్‌ కింద తమ శాఖ తరఫున ఇస్తామన్నారు. ఇప్పుడు ఆథరైజ్డ్‌ సిగ్నేచర్స్‌ చేసే వారిని మార్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారిద్దరూ వచ్చి ఆ చెక్‌లపై సంతకం పెట్టి ఇచ్చేస్తే సమస్య పరిష్కారమైపోతుందన్నారు. మాన్సాస్‌ కరస్పాండెంట్,  సీఎఫ్‌వోల సమక్షంలోనే సమస్యను తేల్చుకుందామంటూ ఉద్యోగులు వెనుదిరిగారు.   

మరిన్ని వార్తలు