సచివాలయ వ్యవస్థ అద్భుతం

27 Apr, 2022 04:49 IST|Sakshi
విజయనగరం జిల్లా కుమిలిలో సచివాలయ సేవల గురించి తెలుసుకుంటున్న కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

దేశమంతా అమలు చేయాలని ప్రధానికి సూచిస్తా

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్‌సుఖ్‌ మాండవీయ

ఆర్బీకేల పనితీరు బాగుంది

దేశానికి ఆదర్శంగా హౌసింగ్‌ కాలనీలు

ఇంటింటికీ వంట గ్యాస్‌ పైప్‌లైన్‌ ఉంటే బాగుంటుందని వెల్లడి 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక, 540 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటనే అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అద్భుతమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ ప్రశంసించారు. సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన సేవలను వారి గ్రామాల్లోనే అందించడం కూడా అభినందించదగ్గదని అన్నారు. ఆయన మంగళవారం రెండో రోజు విజయనగరం జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో అతిపెద్దదైన విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న లేఅవుట్‌ను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడారు.

ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ హౌసింగ్‌ కాలనీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని అభివర్ణించారు. అనంతరం మన బడి నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన బొండపల్లి మండలం గొట్లాంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాల ఫొటో ప్రదర్శనను తిలకించారు. పూసపాటిరేగ మండలం కుమిలిలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సేవలను ఆయనకు జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సచివాలయ వ్యవస్థ అద్భుతమని ప్రశంసించారు. ఆర్బీకేల సేవలను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి వివరించారు. అనంతరం విజయనగరంలోని మహారాజా జిల్లా కేంద్రాస్పత్రిలో పీడియాట్రిక్‌ ఐసీయూను కేంద్ర మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్‌ రోగుల కోసం బ్లాక్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  

ఏజెన్సీలో రోడ్లకు అనుమతులు ఇప్పించండి 
ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు లేక గిరిజనులు అత్యవసర వైద్యాన్ని, విద్యను పొందలేకపోతున్నారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 11 రహదారులకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని కోరారు.

రెండేళ్లలో ఇంత అభివృద్ధా? 
సంక్షేమ పథకాలపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన, స్టాళ్లను కేంద్ర మంత్రి తిలకించారు. నీతిఆయోగ్, యాస్పిరేషన్‌ జిల్లా సూచీలపై సమీక్షించారు. గత రెండేళ్లలో అభివృద్ధిని అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రెండేళ్లలో ఇంత అభివృద్ధి జరగడంపై కేంద్ర మంత్రి అభినందించారు. జిల్లా మరింతగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. తాను మరోసారి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లాల సరసన విజయనగరం ఉండాలని అభిలషించారు. 2025 నాటికి క్షయ, కుష్టు వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు సాఫ్ట్‌వేర్‌ సహా పక్కా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పీవీఎన్‌ మాధవ్, రఘురాజు, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు