వైభవం.. రాఘవేంద్రుల ఆరాధనోత్సవం

25 Aug, 2021 04:11 IST|Sakshi
ఆరాధనోత్సవంలో పాల్గొన్న భక్తజన సందోహం

టీటీడీ తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన అదనపు ఈవో 

మంత్రాలయం రూరల్‌/తిరుమల: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. స్వామి వారు బృందావన ప్రవేశం చేసిన శుభ దినాన వేదభూమి పులకించింది. నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రులు భక్తులకు కనువిందు చేశారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత శ్రీ రాఘవేంద్రస్వామి వారికి వెంకన్న పట్టువస్త్రాలను సమర్పించారు.

ముందుగా పట్టువస్త్రాలను గ్రామ దేవత మంచాలమ్మ సన్ని«ధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టువస్త్రాలను ఉంచి ఊంజల సేవ చేపట్టారు. వాటిని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అలంకరించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి టీటీడీ అదనపు ఈవో «ధర్మారెడ్డి, చైర్మన్‌ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతకు శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను ఇచ్చి ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 21న ప్రారంభమైన స్వామి వారి ఆరాధన మహోత్సవాలు 27తో ముగియనున్నాయి.  

మరిన్ని వార్తలు