మెడ్‌టెక్‌ జోన్‌లో కృత్రిమ అవయవాల తయారీ 

21 Feb, 2023 03:53 IST|Sakshi
బీజీఎంఎస్‌ పరికరాల్ని పరిశీలిస్తున్న ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌

ఇందుకోసం 30 రోజుల్లోనే ఏటీసీ సెంటర్‌ నిర్మాణం 

తాజాగా బీజీఎంఎస్‌ పరికరాల తయారీ 

సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్‌ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్‌.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం.

మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్‌ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది.

ప్రస్తుతం మెడ్‌టెక్‌ జోన్‌లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్‌ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్‌ గ్లూకోజ్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌(బీజీఎంఎస్‌) పరికరాల్ని మెడ్‌టెక్‌జోన్‌లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా.రాజీవ్‌భాల్, ఏఎంటీజెడ్‌ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్‌ స్ట్రిప్స్‌ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్‌ ఎండీ అభినవ్‌ ఠాకూర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు