పరిశ్రమలు నడపడానికి ఓకే

6 May, 2021 03:18 IST|Sakshi

కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ పాటిస్తూ ఉత్పత్తికి అనుమతి

ఉద్యోగులకు వర్కింగ్‌ పాస్‌ సంస్థలే సమకూర్చాలి

పరిశ్రమల శాఖ నిబంధనలు జారీ 

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 కట్టడి కోసం రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ విధించినప్పటికీ తయారీ రంగ పరిశ్రమలు కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఉదయం వివిధ పారిశ్రామిక సంఘాలు, పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సూచనలకు అనుగుణంగా రెండు వారాల కర్ఫ్యూ సమయంలో పరిశ్రమల్లో అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తూ కోవిడ్‌ ప్రొటోకాల్‌ను జారీ చేశారు. 

నిబంధనలు ఇవీ..
► పరిశ్రమలన్నీ వాటి అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టడానికి షిఫ్టుల వారీగా పనిచేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు సింగిల్‌ షిఫ్ట్‌లో నిర్మాణ కార్యక్రమాలు కొనసాగించవచ్చు.
► జాతీయ నిర్మాణ, పైప్‌లైన్‌ పనులు యథావిధిగా కొనసాగించవచ్చు. ఐటీ, ఐటీ ఆథారిత కంపెనీలు, డేటా సెంటర్లకు అనుమతి.
► ఈ–కామర్స్‌ ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి అనుమతి.
► కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంస్థలు సొంతగానే సర్టిఫికేషన్‌ ఇచ్చుకోవాలి.
► కర్ఫ్యూ తర్వాత కూడా పనిచేసే సిబ్బంది ప్రయాణానికి ఆధార్, ఉద్యోగి నంబర్‌ ఆధారంగా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.
► కంపెనీలే ఉద్యోగులకు అనుమతి పత్రాలు మంజూరు చేసి అవి స్థానిక అధికారులకు అందచేయాలి.
► తగిన అనుమతి పత్రాలతో కంటైనర్లు, సరకు రవాణా వాహనాల ప్రయాణానికి అనుమతి.
► పరిశ్రమల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో కమిటీ ఏర్పాటు.  

మరిన్ని వార్తలు