డ్రైవింగ్‌ లైసెన్సు లేదు.. సార్‌!

14 Mar, 2021 04:37 IST|Sakshi

గత 2 నెలలో డ్రైవింగ్‌ లైసెన్సు లేదన్న 22 వేల మంది

లైసెన్సులున్నా లేవని చెబుతున్న పలువురు వాహనదారులు

సస్పెన్షన్‌ నుంచి తప్పించుకోవడానికే  

ఆధార్‌తో లైసెన్సుల డేటాను పరిశీలించాలని రవాణా శాఖ నిర్ణయం 

సాక్షి, అమరావతి: గత రెండు నెలల్లో జరిపిన వాహనాల తనిఖీల్లో 22,130 మంది వద్ద డ్రైవింగ్‌ లైసెన్సులు లేనట్లు రవాణా శాఖ అధికారులు తేల్చారు. కానీ రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్‌ లైసెన్సులున్నట్లు రవాణా శాఖ వద్ద గణాంకాలున్నాయి. అదే సమయంలో ద్విచక్ర వాహనాలు కాకుండా భారీ వాహనాలు నడిపే దాదాపు 10 వేల మంది కూడా లైసెన్సులు లేవని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు విచారణ చేపట్టగా.. కొత్త విషయం వెల్లడైంది. కేవలం లైసెన్సు సస్పెన్షన్‌ నుంచి తప్పించుకునేందుకే.. తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఈ విధంగా చెబుతున్నారని తేల్చారు. ప్రతి వంద మంది వాహనదారుల్లో 70 మంది ఇలాగే చెబుతున్నట్లు వెల్లడైంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లేదని చెప్పడంతో రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందని చెబితే సస్పెండ్‌ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఉపాధి పోతుందని భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు చెబుతున్నారు.
 
ఆధార్‌తో లింక్‌ చేస్తే తేలిపోతుంది..
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా రవాణా సేవలన్నింటికీ ఆధార్‌ లింక్‌ను అనుమతించింది. రాష్ట్రంలో రవాణా శాఖ కూడా ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల కాలంలో అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 20 వేల వరకు లైసెన్సులను సస్పెండ్‌ చేసినట్లు రవాణా శాఖ చెబుతోంది. సస్పెండ్‌ చేసిన లైసెన్సులను ఆధార్‌తో లింక్‌ చేయడం వల్ల వాహనదారుడు ఎట్టి పరిస్థితిలోనూ పోగొట్టుకున్నానని చెప్పేందుకు వీలుండదు. కొత్త కార్డు పొందేందుకూ అవకాశముండదు. అలాగే ఆధార్‌తో లింక్‌ చేస్తే వాహనదారుడికి అసలు లైసెన్సు ఉందా? లేదా? అన్నది కూడా తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌తో లైసెన్సు డేటాను పరిశీలించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్‌ ప్రసాదరావు ‘సాక్షి’కి తెలిపారు.  

మరిన్ని వార్తలు