ఏలూరులో కలకలం.. పలువురికి అస్వస్థత

6 Dec, 2020 07:39 IST|Sakshi

వెంటనే స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని

సాక్షి, ఏలూరు టౌన్‌ : ఏలూరు నగరం విచిత్రమైన వ్యాధితో శనివారం వణికిపోయింది. వన్‌టౌన్‌లోని దక్షిణపు వీధి, పడమరవీధి, టూటౌన్‌ ప్రాంతంలోని గన్‌బజార్, కొత్తపేట, అశోక్‌నగర్, రూరల్‌ ప్రాంతంలోని శనివారపుపేట ఏరియా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ ఉండడంతో నగరంలో జనం హడలెత్తిపోయారు. పలువురు ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోవడంతో కుటుంబీకులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాగా వ్యాధి ఉండటంతో వైద్యులకు జబ్బు ఏమిటో అర్థంకాలేదు. వ్యాధితో పడిపోయిన వారు 10 నుంచి 20 నిమిషాల అనంతరం తిరిగి మామూలు స్థితికి చేరుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పదుల సంఖ్యలో జనం కళ్లు తిరుగుతూ పడిపోగా.. రాత్రికి ఈ సంఖ్య 95 వరకు చేరింది. అంతుచిక్కని ఈ వ్యాధితో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా ఆకస్మికంగా పడిపోవటంతో ప్రజలు భయపడుతున్నారు. 

వ్యాధి ఏమిటో?  
ఏలూరు నగరంలో వారం రోజుల నుంచి దక్షిణపు వీధిలో ఫిట్స్‌లా వస్తూ 30 మంది వరకూ అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే నగరంలోని పడమరవీధి, కొత్తపేట, గన్‌బజార్, అశోక్‌నగర్, శనివారపుపేట ప్రాంతాలకు చెందిన 95 మంది ఇలా ఫిట్స్‌లా వచ్చి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు స్కానింగ్‌ తీసినా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ కావటం సందేహాలకు తావిస్తోంది. ఇలా మూర్చపోయి పడిపోతున్న వ్యక్తులు కొంత సేపటికి తేరుకుని మామూలు స్థితికి వస్తున్నారు. ఇదంతా వైద్యులకే అంతుచిక్కటం లేదు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయటం, రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేస్తేగాని వ్యాధి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు. 

బాధితుల్లో చిన్నారులే అధికం  
శనివారం ఏలూరులో మూర్చపోతూ అనారోగ్యం బారిన పడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కలుషితమైన వాతావరణం, గాలిలో మార్పులు, పరిసరాల పరిశుభ్రత వంటివి కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.  

దక్షిణపు వీధిలో మెడికల్‌ క్యాంపు  
ఏలూరు దక్షిణపు వీధిలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనే సమాచారంతో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సునంద ఆ«ధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది దక్షిణపు వీధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. వెంటనే సాయంత్రానికి మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సత్వరమే వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. పది 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. వైద్యులు నిత్యం హాస్పిటల్‌లో ఉండాలని డిప్యూటీ సీఎం నాని ఆదేశాలు జారీ చేశారు.  

భయపడాల్సిందేమి లేదు: నాని 
రోగులకు యుద్ధప్రాతిపదికన వైద్యం అందుతోందని ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఒక ఆరేళ్ల చిన్నారిని మాత్రం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించామన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అన్నివేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. 

అందరూ క్షేమమే : జేసీ 
అందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని జేసీ హిమాన్షు శుక్లా చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో బాధితులను ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. బాధితుల వెన్నుపూస నుంచి శాంపిల్స్‌ తీసి పరీక్షలకు విజయవాడ పంపించినట్లు చెప్పారు.    

మరిన్ని వార్తలు