అపర భగీరథుడు

2 Sep, 2023 05:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశానికి ధాన్యాగారంగా భాసిల్లిన తెలుగు నేల 1995 నుంచి 2004 మధ్య వరుస కరవులతో తల్లడిల్లింది. పదిమంది ఆకలి తీర్చే అన్నదాత సాగుపై ఆశలు కోల్పోయి, అప్పుల భారంతో బలవన్మరణాలకు పాల్పడ్డాడు. మహా ప్రస్థానం పాదయాత్రలో అడుగడుగునా ఎదురైన ఇలాంటి ఘట్టాలు వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కదిలించాయి. అధికారంలోకి వస్తే గోదావరి, కృష్ణా జలాలను ప్రతి ఎకరాకు అందించి, కరవు రక్కసిని తరిమికొడతానని ఆయన బాస చేశారు. 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే.. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టుతోసహా అనేక ప్రాజెక్టులను జలయజ్ఞం కింద కార్యరూపంలోకి తెచ్చారు.

2004–05లో రాష్ట్ర బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.51,142.92 కోట్లు. కానీ రూ.1,33,730 కోట్ల వ్యయంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టుల పనులకు అనుమతిచ్చారు. కొత్తగా 97.69 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు 23.53 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రణాళిక రూపొందించారు. 2014 మే 14 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు అంటే ఐదేళ్ల మూడు నెలల్లోనే రూ.53,205.29 కోట్ల వ్యయంతో 16 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 25  ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 19.53 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించారు. 3.96 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఉమ్మడి రాష్ట్ర సాగునీటి చరిత్రలో ఇదో రికార్డు.  

సాగునీటి రంగ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం: వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తన తండ్రి వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నారు. ప్రాజెక్టుల పనులకు వైఎస్సార్‌ హయాంలో అడ్డుతగిలిన తరహాలోనే ఇప్పుడూ చంద్రబాబు సైంధవుడిలా అడ్డుతగులుతున్నారు. అయినా సీఎం జగన్‌ వాటిని అధిగమిస్తూ పనులు కొనసాగిస్తున్నారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్, హంద్రీ–నీవా ద్వారా కర్నూలు పశ్చిమ మండలాల్లో 68 చెరువులను నింపే పథకం, వెలిగొండ తొలి దశ, వంశధార స్టేజ్‌–2 ఫేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులు పూర్తి కావొస్తున్నాయి.

నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, అవుకు, గోరకల్లు రిజర్వాయర్లలో మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్‌ వాల్‌తో అడ్డుకట్ట వేశారు. బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తూ 2019, 2020, 2021, 2022లలో ఏటా సగటున కోటి ఎకరాలకు నీళ్లందించి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇక రాష్ట్రానికి పోలవరం జీవనాడి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా అవసరమైన అన్ని అనుమతులను సాధించారు. భారీ వ్యయమయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించి.. కేంద్రం ఇచ్చే 90 శాతం వాటా నిధులతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేశారు.

ఆ ప్రయత్నాలన్నీ సఫలమై ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చే సమయంలోనే వైఎస్సార్‌ హఠాన్మరణం చెందారు. విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించిన కేంద్రం.. వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అప్పటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నారు. చంద్రబాబు పాపం ఫలితంగా గోదావరికి వచ్చిన భారీ వరదలకు డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు