మన్యంలో మ్యూజియం.. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు

12 Oct, 2021 08:51 IST|Sakshi

భావితరాలకు అల్లూరి, గంటందొర, మల్లుదొరల పోరాటగాధలు

‘ఆంధ్ర కాశ్మీర్‌’ లంబసింగి సమీపంలోని తాజంగిలో నిర్మాణం

తెల్లదొరలపై మన్యం వీరుల తొలి తిరుగుబాటు ఇక్కడే

21 ఎకరాల్లో రూ.35 కోట్లతో 2023 మార్చి నాటికి పూర్తి 

నాటి నుంచి నేటి వరకు గిరిజనుల స్థితిగతులపై మ్యూజియంలో ప్రదర్శనలు

సాక్షి, అమరావతి: తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బ్రిటీష్‌ పాలకులపై వీరు సాగించిన సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన విశాఖ జిల్లా తాజంగిలో మన్యం వీరుల స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ప్రకృతి సహజసిద్ధమైన రమణీయ అందాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ‘ఆంధ్ర కాశ్మీరం’ లంబసింగి ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందమైన ఉద్యానవనం మధ్య అరుదైన విశేషాలతో రూపుదిద్దుకోనున్న ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మన్యం పోరాటాన్ని ప్రతిబింబించనుంది.

మొత్తం రూ.35 కోట్లతో చేపట్టిన ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్‌–టీఎం–ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ మిషన్‌) ఆధ్వర్యంలో ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో డిజైన్‌ చేశారు.

యాంపి థియేటర్‌తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్‌ టెక్నాలజీని, ఆడియో, వీడియోలను సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సంప్రదాయ గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. మ్యూజియం పరిసరాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆధునిక రెస్టారెంట్, రిసార్ట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ నిర్మాణం పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు.

మొదటి తిరుగుబాటు ఇక్కడే.. 
విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం విప్లవ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఇది చాలా కీలక ప్రాంతం. పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి–నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునే వారు.

వీరికి కూలీ సరిగ్గా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడేవారు. దీంతో తెల్లదొరల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగుబాటు బావుటా ఎగురవేశాడు. గాం గంటందొర, గాం మల్లుదొరలతో కలిసి పోరాటం చేసి వారిని తరిమికొట్టాడు. ఇంతటి విశిష్టత కలిగినందునే మన్యం వీరుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజంగి ప్రాంతాన్ని ఎంపిక చేసింది.

మ్యూజియంలో 4 జోన్లు..
విశాఖ మన్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియంను ఏ, బీ, సీ, డి అనే  నాలుగు జోన్లుగా విభజించి  పలు అంశాలను ప్రదర్శిస్తారు.  అవి..

జోన్‌–ఏలో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్‌ ప్రభుత్వం రాకకు ముందునాటి గిరిజనుల పరిస్థితులు, వారి జీవన విధానం, అప్పటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. 

 జోన్‌–బిలో గిరిజనుల జీవితాల్లోకి తెల్లదొరలు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష, జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్‌ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటుచేస్తారు. 

 జోన్‌–సీలో బ్రిటీషర్ల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, వారి పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. 

 ఇక జోన్‌–డీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి.

మరిన్ని వార్తలు