ఏవోబీలో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవ సభ

24 Sep, 2021 03:25 IST|Sakshi
సభలో పాల్గొన్న గిరిజనులు

భారీ ర్యాలీ, అమరులైన మావోయిస్టులకు నివాళులు

భారీ సంఖ్యల్లో పాల్గొన్న గిరిజనులు

ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాన్ని మావోయిస్టుల మిలీషియా కమాండర్లు, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 21 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీలోని అత్యంత మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టు మిలీషియా కమాండర్లు, గ్రామ కమిటీల సభ్యుల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. మావోయిస్టుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన మావోయిస్టులకు నివాళులర్పించారు.

అనంతరం తెలుగు, ఒడియా భాషలలో రాసిన బేనర్లు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులపై అణచివేత చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ సభను ఏర్పాటు చేశారు. జననాట్య మండలి ఆధ్వర్యంలో తెలుగు, ఒడియా భాషలలో విప్లవ గీతాలను ఆలపించారు. సభా ప్రాంగణం అంతా ఎర్ర జెండాలు, బ్యానర్లతో నిండిపోయింది. సభలో ఆంధ్ర ఒడిశా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు