చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు దళ సభ్యుడు అరెస్ట్‌

7 Jan, 2023 08:30 IST|Sakshi

బుర్కనకోటలో సుబ్బయ్య హత్యతో ప్రమేయం

చింతూరు పోలీసులకు అప్పగింత 

చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యుడిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ వివరాలను ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట అడిషనల్‌ ఎస్పీ గౌరవ్‌మండల్‌ శుక్రవారం కుంటలో మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న మన రాష్ట్రంలోని చింతూరు మండలం బుర్కనకోటలో బుధవారం రాత్రి సోయం సుబ్బయ్య(35) అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు.

ఈ విషయం తెలిసి ఛత్తీస్‌గఢ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం కుంట పోలీసుస్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. సున్నంపాడు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తారసపడిన గోంపాడు గ్రామానికి చెందిన సోయం సంతోష్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారణ చేయగా, తాను మావోయిస్టు దళ సభ్యుడినని, కుంట ఎల్‌వోఎస్‌ కమాండర్‌ హితేష్‌ హుంగా ఆధ్వర్యంలో 10 మందిమి బుర్కనకోటకు చెందిన సోయం సుబ్బయ్యను హతమార్చినట్లు అంగీకరించాడని అడిషనల్‌ ఎస్పీ తెలిపారు. సంతోష్‌ను శుక్రవారం చింతూరు పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు