ఆర్కేకు మహిళలంటే భయం!

18 Oct, 2021 02:56 IST|Sakshi

మొదట్లో వస్తువులు, దుస్తులంటే నాకు ఇష్టం

అన్ని ప్రాంతాల్లో బాగా తిరగాలని ఉండేది

అది సరికాదని ఆయన వివరంగా చెప్పేవారు

పిల్లలను కనాల్సిందేనని పోట్లాడాను 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్‌కే భార్య శిరీష

టంగుటూరు: నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమమే ఊపిరిగా బతికిన విప్లవ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అక్కిరాజు హరగోపాల్‌ (65) అలియాస్‌ రామకృష్ణ, అలియాస్‌ ఆర్కే. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి సమర్థవంతంగా చర్చించాడు. చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ ధృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశాడు.

ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో ఎన్‌కౌంటర్ల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుని తుది వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డాడు. ‘ప్రజల కోసమే జీవిస్తాం.. ప్రజల కోసమే చస్తాం’ అన్న మాటను నిలుపుకుంటూ విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆర్కే వైవాహిక జీవితం ఎలా సాగింది? ఏ విధంగా పెళ్లి జరిగింది? ఆర్కేకు మహిళలంటే భయమా? పిల్లల విషయంలో ఈ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కుమారుడిని కూడా ఉద్యమంలోకి ఎందుకు ఆహ్వానించాడు? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఆర్కే భార్య శిరీష ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యమ పరంగా ఆర్కే గొప్పలీడర్‌. అలాంటి లీడర్‌ భావజాలానికి మీరు ఎలా దగ్గరయ్యారు? 
శిరీష : పెళ్లికి ముందే 1977 నుంచి 1987 వరకు ఉద్యమంలో పని చేశాను. 1987లో ఆయన (ఆర్కే)తో పరిచయం ఏర్పడింది. ఈ జిల్లాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగేవి. దాంతో ఉద్యమాలు, పెద్ద ఎత్తున మీటింగ్‌లు జరిగేవి. ఆ మీటింగ్‌లకు నేను వెలుతుండేదాన్ని. ఈ మీటింగ్‌లకు ఆయన కూడా వచ్చేవారు.  జననాట్య మండలి ప్రోగ్రాములు జరుగుతుండేవి. నాకు మహిళా సంఘాల్లో పని చేయాలని ఆసక్తి ఉండేది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుతున్నారు. అప్పట్లో తక్కువ. ఆయన దళితుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ.. వారితో తినడం నాకు నచ్చింది. 

మీరు ఏమి చదువుకున్నారు. 
శిరీష : ఇంటర్‌ వరకు చదువుకున్నా.  

కారంచేడు ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? 
శిరీష: అగ్రనాయకులు ఇక్కడికి వచ్చి దళితుల కోసం పోరాడుతుంటే మనం వారికి మద్దతు ఇవ్వకపోతే ఎలా? మనం కూడా పోరాటం చేయాలని అనిపించింది. ప్రశ్నించే వారు ఉండాలి. అడిగితే కానీ ప్రభుత్వాలు ఇవ్వవు. అది భూమి కావచ్చు.. మరేదైనా కావచ్చు. ప్రశ్నించే విధానం అలవర్చు కోవాలి.

ఆర్కేను పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది? 
శిరీష : తొలుత తోటి ఉద్యమదారుల వద్ద ఆర్కే గురించి విన్నాను. ఆ తర్వాత ఆయన పోరాట పంథా నాకు బాగా నచ్చింది. నేను కొంచెం మౌనంగా ఉండే రకం. ఆ విషయం ఆయనకు 
నచ్చింది. కొందరు ఉద్యమకారులు ఆర్‌కే గురించి మా పెద్దవాళ్లకు చెప్పారు. ఇద్దరం ఇష్టపడ్డాకే పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి ఆయనకు మహిళలు అంటే కొంచెం బెరుకు. దూరంగా ఉంటారు. ఇద్దరం అలాంటి వాళ్లమే కాబట్టి త్వరగా కలిసిపోయాం. పెళ్లప్పుడు నా వయసు 19 ఏళ్లు మాత్రమే.

ఆర్కేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనిపించిందా? 
శిరీష : అలా ఎప్పుడూ అనిపించలేదు. అందరిలాగా తిరగాలని అనిపించేది. బయటకు వెళ్లాలని అనిపించేది. అయితే మా పరిస్థితి దృష్ట్యా ఎక్స్‌పోజ్‌ కాకూడదు. బయట తిరగకూడదు. వస్తు వ్యామోహం ఉండకూడదు. మొదట్లో నాకు మాత్రం అన్నీ కావాలని కోరిక ఉండేది. బట్టలు, వస్తువులన్నా వ్యామోహం ఉండేది. అయితే అవన్నీ సరికాదని ఆయన చెప్పే వారు. ఆయన చెప్పేవన్నీ విన్నాక సబబే అనిపించింది. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేదాన్ని.  

ఎప్పుడైనా తగవులు.. గొడవలు పడే వారా?  
శిరీష: పిల్లలు పుడితే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందనే వారు. ‘ఒక్కోసారి పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది.. వారి ప్రేమకు దూరం అవుతాం.. మన ప్రేమకు వారు దూరమవుతారు.. తల్లిదండ్రులకు దూరమై ఇంటి వద్ద ఉన్న పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది. ఆలోచించు’ అన్నారు. ఎంత కష్టమొచ్చిన సరే ఒకరినైనా కనాలని గొడవ పెట్టుకున్నా. ఆ విషయంలో నన్ను కన్విన్స్‌ చేయలేకపోయారు. 1992లో బాబు (మున్నా) పుట్టాడు. 

బాబు పుట్టాక పెంపకం ఎలా? 
శిరీష : అప్పుడు ఆయన నాతోపాటు సంవత్సరం ఉన్నారు. నేను బాబును తీసుకుని అమ్మవాళ్ల వద్దకు వచ్చి ఐదేళ్ల వరకు ఉన్నాను. ఆ సమయంలో నేను మాత్రమే ఆయన్ను అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఆరు సంవత్సరాల తర్వాత బాబును ఆయన చూశాడు. 

బిడ్డ వల్ల ఇబ్బందులొచ్చాయా? 
శిరీష : అలాంటి పరిస్థితి రాలేదు. కాకపోతే తల్లిదండ్రులిద్దరి మధ్య బాబు పెరగడం లేదన్న బాధ నాకుండేది.   అమ్మ వాళ్ల వద్ద కానీ, అక్క వాళ్ల వద్ద కానీ బిడ్డను పెట్టమని చెప్పారు. లేదా పిల్లలు లేని వారికి ఇచ్చేద్దాం అన్నారు.  

మున్నాను ఎంత వరకు చదివించారు? 
శిరీష : ఇంటర్‌ వరకు   

మున్నా ఉద్యమం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? 
శిరీష: అబ్బాయిని రౌడీలా, గూండాలా పెంచకూడదనుకున్నాను. అనుకున్నట్లే మంచి విలువలతో పెంచాను. చిన్నప్పుడు నాన్న ఎక్కడ? అని అడిగినప్పుడు దూరంగా జాబ్‌ చేస్తున్నాడని చెప్పేదాన్ని. ఎందుకు అంత దూరం ఉంటాడు అనేవాడు. ఎప్పుడొస్తారని అడిగేవాడు. వస్తారులే అని చెప్పేదాన్ని. 

ఆర్కే గురించి ఎలా తెలుసుకున్నాడు? 
శిరీష: పెద్దగయ్యే కొద్దీ వాస్తవాలు తెలుసుకున్నాడు. నాన్నను చూడాల్సిందేనని పట్టు పట్టాడు. అడవిబాట పడితే తప్ప అది సాధ్యం కాదని తెలుసుకుని వెళ్లి కలుసుకున్నాడు. వాళ్ల నాన్న వద్దకు వెళ్లి రావడానికి  పోలీసులతో ఇబ్బంది ఉండేది. ఇక్కట్లు వస్తాయని చెప్పాను. చదువు కొనసాగించడమో, లేక ఇక్కడే ఏదైనా జాబ్‌ చేసుకోవాలనో చెప్పాను. అడవిలోకి వెళ్లాక ఆయన భావజాలాలకు కనెక్ట్‌ అయ్యి అక్కడే ఉండిపోయాడు. తండ్రిన మించిన కుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ నాకైతే మరో అబ్బాయి ఉంటే బాగుండేదని అనిపించేది. ఇప్పుడిక వారిద్దరి జ్ఞాపకాలే నాకు మిగిలాయి.   

మరిన్ని వార్తలు