మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే

20 Apr, 2021 23:56 IST|Sakshi

సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్‌: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోన్‌ కమిటీ (ఏఓబీ ఎస్‌జెడ్‌సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ అలియాస్‌ మారన్న, అలియాస్‌ కరుణ, అలియాస్‌ శరత్‌.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్‌ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్‌ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే..
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు.

భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట..
రిటైర్డ్‌ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్‌ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్‌ పటేల్‌. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్‌ అనుబంధ సంస్థ రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్‌స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్‌ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్‌ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు.

చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం

చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్‌

మరిన్ని వార్తలు