మావోయిస్టుల మృతదేహాలను14 కి.మీ. మోసుకుంటూ..

18 Jun, 2021 08:59 IST|Sakshi
ఎన్నో అవస్థల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను మార్చురీకి చేర్చిన పోలీసులు 

కొయ్యూరు/నర్సీపట్నం/పాడేరు : విశాఖ జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం శివారు తీగలమెట్ట వద్ద బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను తరలించడానికి పోలీసులు నానా అవస్థలు పడ్డారు. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండ నుంచి మృతదేహాలను తీసుకురావడం క్లిష్టంగా మారింది. అలాగే, వర్షాలు కురవడంతో జారిపడిపోయే పరిస్థితి. పైగా వాహనాలు రావడానికి మార్గం అనుకూలంగా లేకపోవడంతో మృతదేహాలను 14 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ పలకజీడికి తీసుకొచ్చి అక్కడి నుంచి వ్యాన్‌లో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల, రాజవొమ్మంగి మీదుగా విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సీపట్నం ఏఎస్పీ తుహిన్‌ సిన్హా పర్యవేక్షణలో పట్టణ సీఐ స్వామినాయుడు, కొయ్యూరు సీఐ రమణ మృతదేహాలను పరిశీలించారు. మృతుల బంధువులు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున అవి పాడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుని మార్చురీలో భద్రపరిచారు.

ఎంపీ, ఎమ్మెల్యేలకు పోలీసు భద్రత పెంపు
ఇదిలా ఉంటే.. తీగలమెట్ట ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులకు పోలీసు భద్రతను పెంచింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణతోపాటు ఇతర కీలక నేతలకు భద్రత పెంచడంతోపాటు వారిని కొన్నిరోజుల పాటు మైదాన ప్రాంతాల్లోనే ఉండాలని.. మారుమూల ప్రాంతాల పర్యటనలు రద్దు చేసుకోవాలని  పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అలాగే, ఎమ్మెల్యేలు తమ పర్యటనలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు 2+2 గా ఉన్న వ్యక్తిగత అంగరక్షకులను గురువారం 4+4కు పెంచారు.
 

మరిన్ని వార్తలు