అల్లుడు బియ్యం అదుర్స్‌!

30 Jan, 2023 09:51 IST|Sakshi

నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది.. ఔషధ విలువలున్న ఆహారం తీసుకోవడంపై ఆసక్తి పెరిగింది.. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.. పాత కాలం పంటలకు ప్రస్తుతం మరింత గిరాకీ వచ్చింది. ఆ క్రమంలోనే తమిళనాడుకు చెందిన అల్లుడు బియ్యం (మాపిళ్లై సాంబ) వరి వంగడం పలమనేరు మండలంలో సాగులోకి వచ్చింది. అత్యున్నత గుణాలున్న ఈ  బియ్యా నికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఏడు నెలల కాల పరిమితితో చేతికందే ఈ పంట రైతుకు కాసులవర్షం కురిపించే అవకాశముంది. అలాగే పురాతన వంగడాలను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

సాక్షి, పలమనేరు:  సాధారణంగా మనం తినే బియ్యం తెలుపు రంగులో ఉంటుంది. వరి పంట కాలం కూడా నాలుగునెలలు మాత్రమే. పంట నాలుగడుగుల దాకా పెరుగుతుంది. కానీ అల్లుడు బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. దీని పంటకాలం ఏడు నెలలు. ఆరు నుంచి ఎనిమిది అడుగులు వరకు పెరుగుతుంది. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుండడంతో విపరీతంగా డిమాండ్‌ ఏర్పడింది.

గతంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని రైతులు శతాబ్దాల నుంచి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వారు కాపాడుకుంటూ రావడం వల్లే అపురూపమైన మాపిళ్లై సాంబ రకం వంగడాలు నేటి తరానికి అందుబాటులోకి వచ్చాయి. అక్కడి నుంచి విత్తనాలను తీసుకువచ్చి పలమనేరు మండలంలోని కూర్మాయి వద్ద ఓ ఔత్సాహిక రైతు చందూల్‌ కుమార్‌ ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. సేంద్రియ పద్ధతులో పంట పండిస్తున్నారు. ప్రస్తుతం పంట ఏపుగా ఎదిగింది. ఒబ్బిడికి సిద్ధంగా తయారైంది. 

వంగడం చరిత్ర ఇదీ.. 
తమిళనాడుతోపాటు కేరళలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్న పురాతన వరి వంగడమే మాపిళ్లై సాంబ రకం. తమిళంలో మాపిళ్లై అంటే పెళ్లికొడుకు, అల్లుడు అని అర్థం. పాత కాలంలో అల్లుడు దృఢంగా ఉండాలని పెళ్లికుమార్తె ఇంటి వారు ఈ రకం బియ్యాన్ని వండిపెట్టేవారట. నూతన వధూవరులకు ఈ రకం అన్నాన్నే పెట్టడం ఇప్పటికీ కన్యాకుమారి ప్రాంతంలో ఉంది. ఇందులోని ఔషధ విలువల కారణంగా పురుషులకు వీర్యపుష్టి లభిస్తుందని నమ్ముతారు. ఈ బియ్యాన్ని తింటే కాన్పు సాధారణంగా అవుతుందని విశ్వసిస్తారు. అల్లుళ్లకు ప్రత్యేకంగా వడ్డిస్తారు కనుకే ఈ రకం బియ్యాన్ని మాపిళ్లై సాంబ అని పిలుస్తుంటారు. ఏపీ, తెలంగాణాలో అల్లుడు సాంబ, పెళ్లికొడుకు సాంబ,  కేరళలో వరణ్‌సాంబ, కర్ణాటకలో వర సాంబ, ఉత్తరాది  రాష్ట్రాల్లో దుల్హా సాంబగా పేర్లున్నాయి. ఆన్‌లైన్‌లో ఈ రకం బియ్యానికి బ్రైడ్‌గ్రూమ్‌ రైస్‌ అని పిలుస్తున్నారు. ఇది రాయలసీమలోని బైరొడ్లును పోలి ఉంటుంది. 

పలు సమస్యలకు ఔషధమే! 
ఈ రకం కిలో బియ్యంలో  ఓ గ్రాము ఫ్యాట్, 80 గ్రాముల కార్బొహ్రైడ్రేట్, 7 గ్రాముల ఫైబర్, 7 గ్రాముల ప్రొటీన్, 50.8 గ్రాముల కాల్షియం, 90.4 గ్రాముల పోషకాలు, 5.47 గ్రాముల ఐరన్‌ పోషకాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ బియ్యంతో వండిన ఆహారాన్ని భుజిస్తే రక్తశుద్ధితోపాటు మల బద్దకం, పైల్స్‌ సమస్యలు తలెత్తవు. అలాగే మధుమేహం బారిన పడినవారికి కూడా మేలు చేస్తుంది.  

రూ.200 పైమాటే.. 
దుకాణాల్లో ఈ రకం బియ్యం పెద్దగా అందుబాటులో లేదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి కంపెనీలు కిలో నుంచి మూడు, ఐదు కిలోల బ్యాగుల్లో వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. డీమార్ట్, బిగ్‌ బాస్కెట్‌లాంటి మాల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. రూ.160 నుంచి రూ.250 దాకా కంపెనీలను బట్టి ధరలున్నాయి. 

దేశావాళి వరి వంగడాల్లో అగ్రస్థానం..
హరిత విప్లవం తర్వాత పలు రకాల హైబ్రిడ్‌ వరి వంగడాలు సృష్టించబడ్డాయి. సుమారు 2వేల దాకా వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దేశవాళీ రకాలు వంశపారంపర్యంగా సాగులో ఉన్నాయి. అందులో అత్యంత పోషకాలు కలిగినవిగా రత్నబోడి, నవారా, కులాకర్, తాజముడి, కుజిపాటియాలా, మైసూర్‌మల్లిగె, చిట్టి ముత్యాలు, బర్మాబ్లాక్, బహురూపి, కుంకుమసార, కాలాబాటి, కోతాంబరి లాంటివి పేరు గడించాయి. అయితే వీటన్నింటికీ మించిన రకంగా మాపిళ్లై సాంబ అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే మార్కెట్‌లో దీనికంత డిమాండ్‌ ఏర్పడింది.  

అధ్యయనం చేసి సాగు చేశా 
కొన్నేళ్ల నుంచి ప్రకృతి సేద్యం చేస్తున్నా. పలు రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్నా. గతంలో బ్లాక్‌రైస్‌ను సాగుచేశా. కానీ అన్నింటికంటే ఎక్కువ ఔష ధ గుణాలున్న మాపిళ్లై సాంబ సాగు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, బాగా అధ్యయనం చేశా. అనంతరం సాగు ప్రారంభించా. ఈ ప్రాంత రైతులకు ఈ వంగడాన్ని పరిచయం చేసి సాగు పెంచాలని భావిస్తున్నా.    
– చందూల్‌కుమార్, రైతు, కూర్మాయి, పలమనేరు మండలం
 

అవగాహన పెరుగుతోంది 
హైబ్రిడ్‌ వరి వంగడా ల స్థానంలో దేశవాళీ విత్తనాలపై రైతుల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా సేంద్రి య సేద్యంపై ఎక్కవ మంది మక్కువ చూపుతున్నారు. అపురూపమైన మాపిళ్లై సాంబకు (ఏంఏపీఎస్‌ఏఎంబీఏ–1) మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. రైతులు ఇలాంటి వరి వంగడాలను సాగు చేసేలా గ్రామాల్లో అవగాహన కలి్పస్తున్నాం.   – సంధ్య, వ్యవసాయాధికారి, పలమనేరు మండలం
 
మంచి పోషక విలువలు  
మన పూరీ్వకులు పండించిన ఎన్నో రకాల దేశీవంగడాలు కనుమరుగైయ్యాయి. కానీ కొందరు ఔత్సాహిక రైతులు మళ్లీ వాటిని సాగుచేస్తున్నారు. వీటిలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువగా ఉండడంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది.  అనీమియాతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది. కొలె్రస్టాల్‌ను కూడా తగ్గిస్తుంది.                
 – యుగంధర్, మెడికల్‌ ఆఫీసర్, పలమనేరు

>
మరిన్ని వార్తలు