AP పటిష్టంగా ఫౌండేషన్‌.. మూడు దశల్లో స్కూళ్ల మ్యాపింగ్‌ ప్రక్రియ

22 Nov, 2021 09:06 IST|Sakshi

ఒకే ప్రాంగణంలో లేదా 250 మీటర్ల దూరంలో ఉన్న స్కూళ్ల మ్యాపింగ్‌

తొలిదశలో 1,790 ప్రాథమిక, 108 ప్రాథమికోన్నత, 1,144 ఉన్నత స్కూళ్ల గుర్తింపు

3 ఏళ్లలో 25,396 ప్రాథమిక, 3,108 ప్రాథమికోన్నత, 5,362 ఉన్నత స్కూళ్లలో అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫౌండేషన్‌ విద్యను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా స్కూళ్ల మ్యాపింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మూడు దశల్లో ఆయా స్కూళ్లను ఫౌండేషన్‌ పరిధిలోకి చేర్చేలా మ్యాపింగ్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తొలిదశ మ్యాపింగ్‌ ప్రక్రియను చేపట్టారు. ఇందులో 1,790 ప్రాథమిక పాఠశాలలు, 108 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1,144 ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ప్రతిపాదించారు. ఈ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 79,127 మందిని మ్యాపింగ్‌ ద్వారా ఈ ఏడాది ఫౌండేషన్‌ పరిధిలోకి చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే అమలుకు వచ్చేసరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. అదనంగా మరో 2,857 ప్రాథమిక పాఠశాలలు, 2,663 ఉన్నత పాఠశాలలు మ్యాపింగ్‌ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఉన్నత పాఠశాలల పరిధిలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 2,05,071కు చేరింది.

రెండో దశ కింద..
రెండో దశ కింద 2022–23కు సంబంధించి మ్యాపింగ్‌ ప్రక్రియలో మరికొన్ని స్కూళ్లను ప్రతిపాదించారు. వీటిలో 10,249 ప్రాథమిక పాఠశాలలు, 1,429 ప్రాథమికోన్నత, 3,844 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,273 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉన్నవే. వీటి మ్యాపింగ్‌ ద్వారా 4,66,659 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఫౌండేషన్‌ పరిధిలోకి వస్తారు. ఇక 2023–24లో 13,357 ప్రాథమిక పాఠశాలలు, 2,584 ప్రాథమికోన్నత, 5,576 ఉన్నత పాఠశాలల మ్యాపింగ్‌కు ప్రతిపాదనలు చేశారు. వీటిలో 1,945 స్కూళ్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీటిలోని 3,32,564 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలలకు అనుసంధానమవుతారు.

అనేక జాగ్రత్తలతో మ్యాపింగ్‌
ఈ మ్యాపింగ్‌ ప్రక్రియలో పాఠశాల విద్యా శాఖ అనేక జాగ్రత్తలు చేపట్టింది. ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ లేదా 250 మీటర్ల లోపు ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నప్పటి నుంచే చదువుల్లో గట్టి పునాది వేసేందుకు ఫౌండేషన్‌ స్కూల్‌ విధానం అమలులో భాగంగా పిల్లలకు ఆరేడేళ్లు వయసుకే అక్షర జ్ఞానాన్ని పెంపొందించడం, 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీ బోధనతో ఆ పునాదులను మరింత పటిష్టం చేయడానికి వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లు అనే ఆరంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. 

విద్యార్థులకు అందుబాటులోకి అనేక సౌకర్యాలు..
మ్యాపింగ్‌ ద్వారా ఉన్నత పాఠశాలల ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో 1, 2 తరగతులతో ఉండే ప్రాథమిక పాఠశాలలకు దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానిస్తారు. టీచర్ల నియామకానికి కూడా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 3, 4, 5 తరగతుల్లో 4 సబ్జెక్టులకు నలుగురు, 6, 7 తరగతుల్లో 6 సబ్జెక్టులకు ఆరుగురు, 8, 9, 10 తరగతుల్లో 7 సబ్జెక్టుల బోధనకు ఏడుగురు టీచర్లు ఉండనున్నారు. కొత్త విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతుల విద్యార్థులతో పాటు వాటికి అనుసంధానమయ్యే అంగన్‌వాడీ విద్యార్థులకు పీపీ–1, పీపీ–2 కింద తరగతులు ఏర్పాటు చేయడం ద్వారా వారికీ మంచి బోధన అందుతుంది. హైస్కూళ్ల సిబ్బంది ద్వారా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది.  

మరిన్ని వార్తలు