వెండితెరపై మారేపల్లి కుర్రోడు

8 Jan, 2021 07:52 IST|Sakshi
సినీ హీరో రామ్‌చరణ్‌తో కుమార్‌ స్వామి

హీరోగా పరిచయం కాబోతున్న కుమారస్వామి

‘హెచ్‌23’ సినిమా విడుదల నేడు

రూ.కోటితో కేవలం 27 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి

పుట్టింది పల్లెలో అయినా చలనచిత్రసీమలో గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యువకుడి కథ ఇది. పేదరికమే నేపథ్యం కానీ కష్టపడి చదువుకుని ఉద్యోగం చేస్తూనే తన కిష్టమైన చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు కుమార స్వామి. కథనాయకుడుగా ఎదిగిన దేవరాపల్లి మండలం మారేపల్లికి చెందిన ఈ యువకుడు ‘హెచ్‌ 23’ సినిమాలో హీరో అవకాశం దక్కించుకున్నాడు. శుక్రవారం థియేటర్లలో విడుదుల కానున్న ఆ సినిమా హీరో ప్రస్థానం ఇలా సాగింది.

సాక్షి, దేవరాపల్లి (విశాఖపట్నం): దేవరాపల్లి మండలం మారేపల్లి గ్రామానికి చెందిన ఎన్నేటి వెంకట కుమార స్వామి తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు. మారేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎన్నేటి అప్పారావు, రమణమ్మ దంపతుల కుమారుడు స్వామి. అతనికి అక్కా చెల్లి ఉన్నారు. తల్లిదండ్రులు రోజు వారీ కూలీ పనులకు వెళ్తూ కుటుంబ పోషణ చేసేవారు. కష్టపడి ఉన్నత చదువులు చదివిన కుమార స్వామి మదురై లో ఉద్యోగం చేస్తుండగా ఏర్పడిన పరిచయాలతో అనుకోకుండా చిత్ర పరిశ్రమవైపు అడుగులు పడ్డాయి. ప్రస్తుతం వైవీకేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఇమంది శ్రీను దర్శకుడిగా రూపొందించిన హెచ్‌ 23 సినిమాలో కుమారస్వామి హీరోగా నటించాడు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 థియేటర్లలో శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం యూత్‌ ఫుల్‌ హర్రర్, కామెడీ అని, అందరినీ అలరిస్తుందని కుమార్‌స్వామి తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైల్‌ రన్‌ సందీప్‌ కిషన్‌ ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో కోటి రూపాయల బడ్జెట్‌తో కేవలం 27 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశారు. ఈ  సినిమాకు నిర్మాతలుగా కె.నవీన, వైవీ సంధ్య వ్యవహరించారు.

సినీ రంగ ప్రస్థానం ఇలా.. 
ఎన్నేటి వెంకట కుమార్‌ స్వామి టెన్త్, ఇంటర్‌ దేవరాపల్లి ప్రభుత్వ హైస్కూల్, కళాశాలలోను, డిగ్రీ చోడవరం ఫోర్‌ ఎస్‌ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం ఏయూ క్యాంపస్‌ స్టూడెంట్‌గా పీజీలో ఎంకామ్‌ పూర్తి చేశాడు. అకౌంట్స్‌ పూర్తయిన తర్వాత మదురైలో కనస్ట్రక్షన్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తుండగా అనుకోకుండా వచ్చిన ఆఫర్‌తో హైదరాబాద్‌లోని రవికిరణ్‌ వద్ద అకౌంటెంట్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరాడు. రవికిరణ్‌ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా తాను అకౌంట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించడంతో చిత్ర పరిశ్రమలో అతనికి మరింత పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌తో కొత్త హీరోలు కూడా సినిమా తీయవచ్చునని దృఢ సంకల్పంతో పెద్ద సినిమాలకు ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని కుమార్‌ స్వామి తెలిపాడు. విశాఖ వేదికగా 2015లో వై.వి.కె.ఎస్‌ క్రియేషన్‌ సంస్థను ఏర్పాటు చేశానని ఈ క్రియేషన్‌ కింద వైజాగ్‌పై పాటను చిత్రీకరించామని చెప్పాడు. విశాఖ అందాలు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలతో పాట రూపంలో వినిపించామని తాము పడిన శ్రమకు మంచి స్పందన లభించిందని యూట్యూబ్, సోషల్‌ మీడియాలో ఈ పాట వైరల్‌ అయిందని తెలిపాడు. తాము రూపొందించి చిత్రలహరి వెబ్‌ సిరీస్‌ మూడు సీజన్లకు మంచి ఆదరణ లభించిందన్నాడు.

కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే కారణం
తల్లిదండ్రులతో పాటు మా కుటుంబ సభ్యులైన అక్క, చెల్లె, బావల సహాయ సహకారం, ప్రోత్సాహంతోనే తన సినీ ప్రస్థానం కొనసాగుతోంది. చిత్ర పరిశ్రమలు పలువురు ప్రముఖుల సలహాలు, సూచనలు కూడా అందించారు. విశాఖపట్నం వేదికగా ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయడం ఆనందంగా ఉంది. తక్కువ బడ్జెట్‌తో కూడా సినిమా తీయాలన్న సంకల్పం నెరవేరింది. ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారని ఆశిస్తున్నా. 
–ఎన్నేటి వెంకట కుమార్‌ స్వామి, హెచ్‌23 మూవీ సినీ హీరో 

మరిన్ని వార్తలు