చందాదారుల సొమ్ముతో దందా!

13 Mar, 2023 14:28 IST|Sakshi

సేకరించిన డబ్బులను దారి మళ్లించిన మార్గదర్శి 

సొమ్ములు మన చందాదారులవి.. పెత్తనం పక్క రాష్ట్రాల వారిది

ఇదో పోంజీ స్కామ్‌.. అక్రమాలకు ఆధారాలున్నాయన్న కోర్టులు

పలువురు చందాదారుల నుంచి ఫిర్యాదులూ అందాయి

విచారణకు సహకరించని యాజమాన్యం

చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడం మా విధి

ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం

మీడియాతో సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–­రిజిస్ట్రేషన్ల ఐజీ వి.రామకృష్ణ 

సాక్షి, అమరావతి: మార్గదర్శి యాజమాన్యం చందాదారుల డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు తమ తనిఖీల్లో వెల్లడైందని సీఐడీ అదనపు డీజీ సంజయ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చట్ట ప్రకారం చిట్‌ఫండ్‌ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే చిట్స్‌ రిజిస్ట్రార్‌కు మార్గదర్శి యాజమాన్యం సహకరించడం లేదని తెలిపారు.

చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం తమ బాధ్యతని, ఇదే ధోరణి కొనసాగితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిధుల దుర్వినియోగం, మోసం, చట్ట ఉల్లంఘనలకు సంబంధించి తాము నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు న్యాయస్థానం కూడా రిమాండ్‌కు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొందని గుర్తు చేశారు.

 “మన రాష్ట్రంలో చందాదారుల సొమ్మును ఇతర రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేస్తున్నారు. అందుకు ఇక్కడ బాధ్యులు ఉండరు. ఇతర రాష్ట్రాల్లో అడిగితే మీకు సంబంధం లేదంటున్నారు. అంటే  చందాదారులు చెల్లిస్తున్న సొమ్ముకు ఎలాంటి భద్రతా లేదు’ అని పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో వారు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను వివరించారు.

చిట్‌ఫండ్‌ చట్టం సామాజిక, ఆర్థికపరమైన చట్టమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. చందాదారుల హక్కుల పరిరక్షణ, చిట్‌ఫండ్‌ కంపెనీల్లో ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఈ చట్టం చేశారని పేర్కొంది. చిట్‌ఫండ్స్‌ చట్టం–1982 ప్రకారం చిట్‌ఫండ్‌ కంపెనీ బ్రాంచిలోని మేనేజర్‌ (ఫోర్‌మేన్‌) చందాదారులు చెల్లించే సొమ్ముకు పరిరక్షకుడు. చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పర్యవేక్షకుడు. 

♦ బ్యాంక్‌ లావాదేవీల నిర్వహణ, నిధుల చెల్లింపులన్నీ ఫోర్‌మేన్‌ నిర్వహించాలి. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉన్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో తనిఖీలు చేశాం. చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదన్న విషయం  అందులో వెల్లడైంది. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేశారు. 

♦ మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్‌ పవర్‌తోసహా ఎలాంటి అధికారాలు లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్‌ పవర్‌ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. 

ఇక్కడున్న చందాదారుల సొమ్ముల భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌ వెళ్లి అడిగితే తెలంగాణలో ఉన్న ప్రధాన కార్యాలయం ఏపీ అధికారుల పరిధిలోది కాదంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారులు చెల్లిస్తున్న డబ్బులకు బాధ్యులెవరని ప్రశ్నిస్తే సమాధానమే  లేదు. సొమ్ము రాష్ట్ర ప్రజలది...పెత్తనం పక్క రాష్ట్రంలో వారిది. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులకు చెందిన సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్‌ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చారెŠట్‌డ్‌ అకౌంటెంట్‌ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి. అందుబాటులో ఉన్న కొన్ని బ్యాంకు ఖాతాలను పరిశీలించగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో మూడుసార్లు  రూ.29 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు చొప్పున, ఎడెల్‌వైసీస్‌ ఆర్బిట్రేడ్‌ ఫండ్స్‌లో రూ.10 కోట్లు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. పూర్తి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇంకా ఎన్ని పెట్టుబడులు పెట్టారో తెలుస్తుంది. 

♦ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరులో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఫోర్‌మెన్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాం. గుంటూరు మినహా మిగతా మూడు చోట్లా న్యాయస్థానాలు నిందితులకు రిమాండ్‌ విధించాయి. నిందితులపై సీఐడీ మోపిన అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని రిమాండ్‌కు అనుమతిస్తూ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సీఐడీ కేసు డైరీలో పేర్కొన్న అంశాలతో తాము సంతృప్తి చెందినట్లు, వారిని అరెస్టు చేయడం సరైనదేనని పేర్కొన్నాయి.

♦ మార్గదర్శి యాజమాన్యం నిధులను అక్రమంగా బదిలీ చేస్తూ, చిట్స్‌ రిజిస్ట్రార్‌కు సహాయ నిరాకరణ కొనసాగిస్తే చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారన్న అంశంతో మాకు నిమిత్తం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు, చందాదారుల సొమ్ముకు భద్రత కల్పించడమే మా విధి. ఈ కేసులో విచారణ కొనసాగిస్తాం. కేసు దర్యాప్తులో పురోగతికి అనుగుణంగా ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 చెరుకూరి శైలజను కూడా విచారించడంతోపాటు ఇతర చర్యలను తగిన సమయంలో తీసుకుంటాం.

ఇదో.. పోంజీ తరహా స్కామ్‌
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యాజమాన్యం పోంజీ స్కామ్‌ తరహా అక్రమాలకు పాల్పడుతోంది.  చిట్టీలలో 30 శాతం నుంచి 40 శాతం టికెట్లు (సభ్యత్వాలు) యాజమాన్యం పేరిట ఉంచుతోంది. ఆ టికెట్లకు చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. ఇతర చందాదారులు చెల్లించిన చందాలను తాము చెల్లించినట్లు రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్‌ తీసుకుంటోంది. చందాదారుల సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటోంది. 

రూ.15 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ డిపాజిట్లు సేకరిస్తోంది. చిట్‌ఫండ్‌ కంపెనీలు డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15 వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. 

చందాదారుల నుంచి ఫిర్యాదులు
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ చిట్‌ఫండ్‌ చట్టం, ఇతర చట్టాలను అనుసరించి మార్గదర్శిపై స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఒక్క చిట్‌ఫండ్‌ చట్టమే కాకుండా ఇతర చట్టాలను కూడా ఉల్లంఘించారు. సీఐడీ కేసు నమోదు చేయగానే పలువురు చందాదారులు తాము మోసపోయామని, తమకు డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే 8 మంది చందాదారులు ఫిర్యాదు చేశారు. ఓ చందాదారుడు తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలను ఆర్నెల్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. 

మార్గదర్శి మేనేజర్లకు  రిమాండ్‌
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కాకినాడ లీగల్‌/విశాఖ లీగల్‌: నిబంధనలకు విరుద్ధంగా చిట్స్‌ నిర్వహిస్తున్న కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన మార్గదర్శి విజయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ (ఫోర్‌మెన్‌)ను రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి స్ట్రేట్‌ సునందమ్మ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. ఈ కేసులో సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మార్గదర్శి మేనేజర్‌కు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించారు.

కాగా, మార్గదర్శి రాజమహేంద్రవరం బ్రాంచ్‌ మేనేజర్‌ సత్తి రవిశంకర్‌ను కాకినాడ రెండో అదనను జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఎం.ప్రసన్నలక్ష్మి ఎదుట సీఐడీ పోలీసులు సోమవారం హాజరుపర్చారు. రవిశంకర్‌కు ఒకరోజు రిమాండ్‌ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ కేసులో కాకినాడ సీఐడీ కోర్టు పరిధిలో విచారణ చేయకూడని కొన్ని సెక్షన్లు ఉండటంతో.. సంబంధిత రికార్డును రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పంపారు. ఈ నేపథ్యంలో రవిశంకర్‌ను రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టులో హాజరు పరచనున్నారు.

పోలీస్‌ కస్టడీకి అనుమతి
విశాఖపట్నం సీతంపేటలోని మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్‌ కామినేని రామకృష్ణను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు సోమవారం అంగీకరించింది. మంగళ, బుధవారాలలో రెండు రోజులపాటు ఆయనను పోలీసులు విచారించవచ్చని న్యాయస్థానం పేర్కొంది.  
 

మరిన్ని వార్తలు