CM YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌ బీసీల పక్షపాతి

11 Aug, 2021 04:50 IST|Sakshi

ఓబీసీ బిల్లుపై చర్చలో ఎంపీ మార్గాని భరత్‌

కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని కోరిన ఎంపీ బెల్లాన

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీల పక్షపాతి అని, రాజమండ్రి లోక్‌సభా స్థానాన్ని బీసీలకు ఇచ్చి.. లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ (127వ సవరణ) బిల్లుపై మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఓబీసీల జాబితా రూపొందించుకునేలా రాష్ట్రాలకు హక్కులు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో దేశవ్యాప్తంగా 671 కులాలు గుర్తింపునకు నోచుకోలేదని, దేశ జనాభాలో ఐదోవంతు మంది రిజర్వేషన్లకు నోచుకోలేదని పేర్కొన్నారు.

తాజా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం, సీఎం తరఫున స్వాగతిస్తున్నామన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు అనేక సందర్భాల్లో నష్టపోతున్నాయని, నీట్‌ పరీక్షల విషయానికి వస్తే ఓబీసీ కులాలు వేలాది సీట్లు కోల్పోయాయని తెలిపారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని, వెనకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచారని వివరించారు. నామినేటెడ్‌ పదవులను కూడా 50 శాతం బీసీలకు కేటాయించారని, మహిళలకు సైతం 50 శాతం పదవులు కట్టబెట్టారని తెలిపారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో రాజకీయంగా, ఆర్థికపరంగా కూడా అందాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కూడా ఓబీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. 

కులాల వారీగా ప్రత్యేక బీసీ జనగణన చేపట్టండి
చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కులాల వారీగా ప్రత్యేక బీసీ జనగణన చేపట్టాలని, సుదీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌ను కేంద్రం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కొద్ది నెలల్లో జనగణన ప్రారంభం కానున్న దృష్ట్యా.. కులాల వారీ జనగణన చేపట్టేందుకు ఇది తగిన సమయమని వైఎస్సార్‌సీపీ అభిప్రాయపడుతోందన్నారు. అనేక సంస్థలతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్తలు అర్థవంతమైన ప్రణాళిక కోసం, వెనుకబడిన బీసీల అభ్యున్నతికి ఈ ప్రత్యేక జనగణన అవసరాన్ని నొక్కి చెప్పారని గుర్తు చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జనాభాలో 40–55 శాతం మధ్య ఓబీసీలు ఉండగా.. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన వారిలో కేవలం వరుసగా 18 శాతం, 20 శాతం మాత్రమే ఓబీసీలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ లోపాలను సవరించి ప్రతి రంగంలో బీసీలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. గడచిన నాలుగేళ్లలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్లు అమలుకాక ఓబీసీలు 11,027 సీట్లు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ) జాబితాను రాష్ట్రాలే రూపొందించుకునేలా తాజా రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాలకు రాజ్యాంగం ప్రసాదించిన సమాఖ్య హక్కులను గౌరవిస్తూ బీసీ కులాల సాధికారతకు కేంద్రం దోహదపడిందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు