రిటైల్‌ రంగంలోకి మార్క్‌ ఫెడ్‌

17 Feb, 2022 05:25 IST|Sakshi
మార్క్‌ అప్‌ ఉత్పత్తులను డీలర్లకు అందజేస్తున్న మంత్రి కురసాల కన్నబాబు

‘మార్కప్‌’ పేరిట బియ్యం సహా 12 రకాల ఉత్పత్తులు

లోగోను ఆవిష్కరించి ఉత్పత్తుల్ని విడుదల చేసిన మంత్రి కన్నబాబు

మార్చి 1 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి

సాక్షి, అమరావతి: ఏపీ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ ఫెడ్‌) రిటైల్‌ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. రైతుల నుంచి సేకరించే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి అందుబాటు ధరల్లో నాణ్యమైన నిత్యావసర సరుకుల్ని తెలుగు ప్రజల ముంగిటకు తీసుకెళ్తోంది. తొలి విడతగా బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి, కారం వంటి 12 రకాల నిత్యావసర సరుకులను మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ అండర్‌ టేకింగ్‌ ఫర్‌ పీపుల్‌ (మార్కప్‌) పేరిట నెలకొల్పిన కంపెనీ లోగోను బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదనరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మార్కప్‌ ఉత్పత్తులను విడుదల చేశారు.

రైతుల సంక్షేమం కోసమే మార్కప్‌: కన్నబాబు
ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు రైతుల నుంచి సేకరిస్తున్న ఆహార ఉత్పత్తుల అమ్మకంలో నష్టాలను అధిగమించే లక్ష్యంతోనే మార్క్‌ఫెడ్‌ రిటైల్‌ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. రైతుల నుంచి సేకరించే ఉత్పత్తులతో పాటు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఇతర నిత్యావసర సరుకులను కూడా విక్రయించడం వల్ల అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. హెరిటేజ్, రిలయన్స్‌ వంటి సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తాయని, మార్కప్‌ మాత్రం రైతులు, వినియోగదారుల క్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు.

వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌), డీసీఎంఎస్, ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ స్టోర్స్, రైతు బజార్లు, డ్వాక్రా బజార్లు, ఎఫ్‌పీవోల ద్వారా మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణ ద్వారా గడచిన మూడేళ్లలో కనీస మద్దతు ధర దక్కని వ్యవసాయ ఉత్పత్తులను పెద్దఎత్తున కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇలా సేకరిస్తున్న ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్లడం ద్వారా వారికి మరింత లబ్ధి చేకూర్చేందుకు మార్క్‌ ఫెడ్‌ రిటైల్‌ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు.

మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా మార్కెట్‌లోకి వస్తున్న విజయ బ్రాండ్‌ వంట నూనెలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. అదే తరహాలో మార్కప్‌ కూడా మార్కెట్‌లో ప్రధాన భూమిక పోషించనుందని చెప్పారు. మార్క్‌ ఫెడ్‌ ఎండీ పీఎస్‌ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. పంజాబ్, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా రిటైల్‌ మార్కెటింగ్‌ రంగంలోకి మార్క్‌ఫెడ్‌ అడుగు పెడుతోందన్నారు.

నాణ్యతకు పెద్దపీట వేస్తూ ప్రీమియం, పాపులర్, ఎకానమీ రేంజ్‌లలో మార్క్‌ ఫెడ్‌ బ్రాండింగ్‌తో మార్కెట్‌లోకి వెళ్తున్నామన్నారు. వ్యాపార లావాదేవీలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్‌ చేశామన్నారు. మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 వేల రిటైల్‌ షాపుల్లో మార్కప్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, çసహకార శాఖ కమిషనర్లు హెచ్‌.అరుణ్‌కుమార్, ఎస్‌ఎస్‌ శ్రీధర్, ఎ.బాబు, సెర్ప్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు